India Economy : జపాన్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ..!
India Economy : రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

India Economy
India Economy : భారత్ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దాంతో నామమాత్రపు జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
2024 వరకు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకారం.. భారత్ జపాన్‌ను దాటేసి నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
Read Also : Apple iPhone 17 Air : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ వస్తోందోచ్.. కెమెరా, ధర, డిజైన్ లీక్..!
‘విక్షిత్ రాజ్య ఫర్ విక్షిత్ భారత్ 2047’ అనే అంశంపై 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటాను ఉటంకిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నట్లు ప్రకటించారు.
జపాన్ కన్నా భారత్ పెద్దది :
“భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ఇది నా డేటా కాదు. IMF డేటా. భారత్ నేడు జపాన్ కన్నా పెద్దది. యునైటెడ్ స్టేట్స్, చైనా, జర్మనీ మాత్రమే ఆర్థికంగా పెద్దవి. మనం ఇదే తరహాలో ముందుకు సాగితే మరో 2 ఏళ్లు నుంచి 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం” అని సుబ్రహ్మణ్యం అన్నారు.
2026 ఆర్థిక సంవత్సరానికి భారత్ నామినల్ జీడీపీ సుమారు 4,187.017 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ఏప్రిల్ ఎడిషన్ అంచనా వేసింది. జపాన్ అంచనా వేసిన 4,186.431 బిలియన్ డాలర్ల జీడీపీని కొద్దిగా అధిగమించింది.
రాబోయే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఇప్పటికే ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా వేసింది.
2025లో భారత ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం, 2026లో 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ, ప్రాంతీయంగా ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది.
2025, 2026 ఏళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 2.8 శాతంగా ఉంటే 2026లో 3.0 శాతంగా గణనీయంగా తక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.