మెటా ఖతర్నాక్ ప్లాన్.. వాట్సాప్ లో ఇక మీకు యాడ్స్ వస్తాయ్.. కళ్లు తిరిగే బిజినెస్..
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెద్దెత్తున వ్యాపారం చేస్తున్న మెటా.. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ ను చేరుస్తోంది.

WhatsApp Adds: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కువశాతం మంది ఫోన్‌లలోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఫేసుబుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వాటిల్లో మెస్సేజ్ లు చేస్తూ, పోస్టులు పెడుతూ.. రీల్స్, వీడియోలు చూస్తు గడిపేస్తున్నారు. వీరిలో కొందరు వాటినే వృత్తిగా చేసుకొని లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇన్నాళ్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారానే డబ్బులు వస్తుండగా.. తాజాగా.. వాట్సాప్ కూడా యాడ్స్ ను తెరపైకి తెచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా ప్రజలతో వాట్సాప్ మమేకమైపోయింది. మెసేజ్, ఫొటో, వీడియో.. ఇలా ఏది పంపాలన్నా వాట్సాప్ మాత్రమే వాడేంతగా మనం అలవాటు పడిపోయాం. తాజాగా.. మెటా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేసుబుక్, ఇన్ స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్ లోనూ యాడ్స్ ను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ అప్‌డేట్స్ ట్యాబ్‌లో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.
యూజర్లు, వారి కాంటాక్ట్స్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ సందేశాలతో పాటు స్టేటస్ ఫీచర్ లో వాట్సాప్ స్పాన్సర్ చేసే ప్రకటనలూ ప్రత్యక్షం అవుతాయి. బ్రాండ్స్ తమ చానెళ్లను ప్రచారంలోకి తేవడానికి కావాల్సిన రుసుము చెల్లించే సౌకర్యాన్ని వాట్సాప్ పరిచయం చేయనుంది. తద్వారా ఫాలోవర్లకు టెక్ట్స్, వీడియోల రూపంలో కంటెంట్ ను పంచుకోవచ్చు. కంటెంట్ ను ఆస్వాదించేందుకు తమకు నచ్చిన చానెళ్లకు నెలవారీ చందా చెల్లించేందుకు సైతం ఫాలోవర్లకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్‌డేట్స్ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నంబర్లు షేర్ చేయడం, లేదా అమ్మడం చేయబోమని కూడా పేర్కొంది.
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చూసిన మెటా.. తాజాగా వాట్సాప్ యాడ్స్ ను తెరపైకి తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 200 కోట్ల పైచిలుకే.. ఇందులో 85.4 కోట్ల యూజర్లతో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో బ్రెజిల్ 14.8కోట్లు, ఇండోనేషియా 11.2 కోట్లు, యూఎస్ 9.8కోట్లు, ఫిలిప్పీన్స్ 8.8కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం వాట్సాప్ 60 భాషల్లో 180 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
వాట్సాప్ అప్‌డేట్స్ ట్యాబ్ ను రోజుకు 150కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఈ అంశమే వాట్సాప్ మతృసంస్థ మెంటాకు కలిసి రానుంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెద్దెత్తున వ్యాపారం చేస్తున్న మెటా.. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ ను చేరుస్తోంది. అయితే, ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్ బుక్ షార్ట్ వీడియోలతో పోలిస్తే వాట్పాప్ స్టేటస్ లోని ప్రకటనలు బ్రాండ్స్ చేసే పెట్టుబడిపై తక్షణ రాబడిని ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.