లోహాన్ని బంగారంగా మార్చగలమంటున్న అమెరికా స్టార్టప్.. ఎలాగంటే?
ఫ్యూషన్ రియాక్టర్లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. కొత్త పదార్థాల అభివృద్ధి, ప్లాస్మా నియంత్రణ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

Gold
సాధారణ లోహాలను బంగారంగా మార్చాలన్న శతాబ్దాల నాటి కలకు ఇప్పుడు శాస్త్రీయ రూపం లభించింది. అణు భౌతికశాస్త్రం, ఫ్యూషన్ సాంకేతికత సాధించిన అభివృద్ధితో ఇది సాధ్యమవుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు.
ఆల్కమిస్ట్ (Alchemist) అంటే లోహాలను బంగారంగా మార్చే వృత్తి. పురాతన కాలంలో మాయామంత్రాల ద్వారా లోహాలను బంగారంగా మార్చాలని చాలా మంది ప్రయత్నించినట్లు కథలు ఉన్నాయి.
ఆధునిక శాస్త్రజ్ఞులు ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చడం అణు కణభౌతికశాస్త్రం ద్వారా సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. కానీ దీన్ని ఆచరణలోకి తీసుకురావడం పెద్ద సవాలే.
కాలిఫోర్నియాలోని మారథాన్ ఫ్యూషన్ అనే స్టార్టప్ మెటల్‌ను బంగారంగా మార్చే కొత్త పద్ధతిని ప్రతిపాదించింది. ఫ్యూషన్ రియాక్టర్‌లో న్యూట్రాన్ రేడియేషన్‌ను వినియోగించి మెర్క్యూరీ-198 ఐసోటోప్‌లపై అధిక శక్తి న్యూట్రాన్‌లను పోసే విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. దీని వల్ల రేడియోధార్మిక మెర్క్యూరీ-197 ఏర్పడుతుంది, అది స్థిరమైన బంగారం-197గా పరిణమిస్తుంది. ఇది సహజంగా ఉన్న ఏకైక స్థిర ఐసోటోప్.
ఒక గిగావాట్ ఫ్యూషన్ ప్లాంట్ సిద్ధాంతపరంగా ప్రతి ఏడాది టన్నుల కొద్ది బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అసాధ్యమైనది కాదు. స్విట్జర్లాండ్‌లోని సీఈఆర్ఎన్ వద్ద ఉన్న లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లో శాస్త్రవేత్తలు సబ్‌అటామిక్ పార్టికిళ్లు ఢీ కొనేలా చేయంతో కొంత బంగారం ఏర్పడింది.
అలిస్ ప్రయోగంలో నాలుగు ఏళ్లలో కేవలం 29 పికోగ్రాములు మాత్రమే బంగారం ఏర్పడింది. కాబట్టి పార్టికల్ యాక్సిలరేటర్లు బంగారం తయారీకి అనువైనవి కావు. ఈ ప్రక్రియకు అవసరమైన 6 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్‌లకంటే ఎక్కువ శక్తిగల న్యూట్రాన్ ఫ్లక్స్‌ను ఉత్పత్తి చేయడమే ప్రధాన సవాలు. మారథాన్ ఫ్యూషన్ డిజిటల్ ట్విన్ అనే కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించి ఫ్యూషన్ రియాక్టర్ ఫిజిక్స్‌ను అంచనా వేస్తోంది.
ఇంకా ఎటువంటి కమర్షియల్ ఫ్యూషన్ రియాక్టర్ ఉండకపోవడం వల్ల ఈ విధానాన్ని పరీక్షించలేదు. ఫ్యూషన్ రియాక్టర్లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. కొత్త పదార్థాల అభివృద్ధి, ప్లాస్మా నియంత్రణ వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
యూకేలోని జాయింట్ యూరోపియన్ టొరస్ కొంతశాతం శక్తిని మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. కానీ భవిష్యత్తులోని స్టెప్ వంటి డిజైన్లు 2040 నాటికి అమలులోకి రావచ్చు. ఫ్యూషన్ ద్వారా మెర్క్యూరీని బంగారంగా మార్చడం శాస్త్రీయంగా సాధ్యమే అయినా, ప్రస్తుతానికి ఇది ఆచరణలో అసాధ్యమైనదే.