ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం…భారీగా ఉద్యోగుల తొలగింపు

ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT)కంపెనీలు కీలక నిర్ణయాలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి టాప్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశాలను విస్పష్టంగా వెల్లడించిన క్రమంలో ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టనున్నాయి. మధ్య, సీనియర్ ఐటీ ఉద్యోగుల్లో 5 నుంచి 8 శాతం మందిని తొలగించాలని ఐటీ కంపెనీలు ఫ్లాన్ చేసినట్లు సమాచారం. ఉద్యోగుల సామర్థ్యం, వార్షిక సమీక్షలో భాగంగా ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.
రానున్న త్రైమాసికాల్లో దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఐటీ ఉద్యోగులపై వేటు వేయవచ్చని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది. మార్జిన్ల నిర్వహణ, అమెరికాలో నియామకాలు ఊపందుకోవడం, నూతన టెక్నాలజీల రాక వంటి అంశాలు టెకీల తొలగింపునకు దారితీసినట్లు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది.
రూ 20 లక్షల నుంచి రూ 40 లక్షల వార్షిక వేతనం అందుకునే ప్రాజెక్టు మేనేజర్లకు ఉద్యోగాలు కోల్పోయే ముప్పు అధికమని నిపుణులు తెలిపారు. కాగ్నిజెంట్ 12,000 మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టిస్తుండగా, ఇన్ఫోసిస్ 10,000 మంది ఉద్యోగులను సాగనంపనుంనున్నట్లు వార్తలు వస్తున్నాయి.