జీతం పడినా డబ్బులు ఉండట్లే.. 5 నిమిషాల్లో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.7కు పడిపోయింది.. మీ పరిస్థితీ ఇంతేనా?

నగర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఖర్చులు పెరుగుతున్నాయని, పొదుపు తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. క్రెడిట్‌ సిస్టమ్‌ వల్ల కోట్లాది మంది అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు.

జీతం పడినా డబ్బులు ఉండట్లే.. 5 నిమిషాల్లో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.7కు పడిపోయింది.. మీ పరిస్థితీ ఇంతేనా?

Updated On : July 6, 2025 / 4:16 PM IST

“ఉద్యోగం వస్తే చేతిలో డబ్బులు ఉంటాయి. ఇష్టం వచ్చినవి కొనుక్కోవచ్చు” అని చాలా మంది భావిస్తుంటారు. ఉన్న ఊరుని వదిలి హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లి పనిచేస్తుంటారు. అయితే, ఉద్యోగం ఉన్నవారి పరిస్థితులు బాగానే ఉంటున్నాయా? వాళ్లకు వచ్చే జీతంతో జీవితాన్ని హాయిగా గడుపుతున్నారా?

బ్యాంకు ఖాతాలో అలా జీతం పడగానే ఇంటి రెంటు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు… ఇలా ఒక్కొక్కటిగా అన్నింటికి చెల్లింపులు చేయాల్సి వస్తోంది. వాటన్నింటినీ కట్టాక చేతిలో ఎంత మిగులుతోంది. ఇటువంటి బాధనే అనుభవిస్తున్న ఓ ఉద్యోగి తన బాధను రెడిట్‌లో చెప్పుకున్నాడు.

ఐదు నిమిషాల్లో తన బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.43,000 నుంచి రూ.7కు పడిపోయిందని అన్నాడు. అతని ఖర్చుల వివరాలు చూస్తే మిడిల్ క్లాస్ వాళ్లు అందరూ అనుభవిస్తున్న సమస్యగా కనపడుతోంది. ఈ తరం జీవన శైలికి అద్దం పడుతోంది.

ఆ ఉద్యోగి వివరించిన ఖర్చులు ఇలా ఉన్నాయి.. గది అద్దె రూ.19,000, క్రెడిట్‌ కార్డ్ చెల్లింపు రూ.15,000 (పూర్తి బిల్‌ రూ.60,000), రెండు ఈఎంఐలు రూ.10,000. అంతేకాకుండా ఇంటర్నెట్, మొబైల్‌ బిల్లులు రూ.3,700. చివరికి బ్యాలెన్స్‌ రూ.7 మాత్రమే మిగిలింది.

Also Read: ఈ బిర్యానీలు రుచి చూడని జన్మెందుకు? ఎక్కడెక్కడ ఏయే బిర్యానీ దొరుకుతుంది?

ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. నగర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఖర్చులు పెరుగుతున్నాయని, పొదుపు తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. క్రెడిట్‌ సిస్టమ్‌ వల్ల కోట్లాది మంది అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం మూడు సంవత్సరాల్లో వ్యక్తిగత రుణాలు 75% పెరిగాయి. మూడవ వంతు మంది ఉద్యోగులు ఆదాయంలో 33% కంటే అధిక మొత్తాన్ని ఈఎంఐలకే ఖర్చు చేస్తున్నారు. కొందరి విషయంలో ఈ మొత్తం 45% దాటుతోంది.

మార్సెలస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ సంస్థకు చెందిన సౌరభ్‌ ముఖర్జియా చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 5 నుంచి 10% మధ్య తరగతి కుటుంబాలు పూర్తిగా అప్పు ఊబిలో చిక్కుకున్నాయి. “ఈ అప్పును ఏదో పెట్టుబడుల కోసం తీసుకోవడం లేదు. బతకడానికి తీసుకుంటున్నారు” అని ఆయన స్పష్టం చేశారు.