నా ఆరోగ్యం బాగోలేదు.. బెయిల్ ఇప్పించండి : నీరవ్ మోదీ

PNB బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా నీరవ్.. లండన్ కోర్టులో తాజాగా బెయిల్ అప్పీల్ చేశారు. తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నానని, తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోర్టును మోదీ కోరారు. గృహ నిర్బంధం కింద తనను ఉంచాలని కోర్టును అభ్యర్థించారు. మనీలాండరింగ్ కేసులో నీరవ్ మోదీని మార్చి 19న లండన్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి బెయిల్ కోసం నీరవ్ ప్రయత్నించినప్పటికీ యూకే కోర్టు నాలుగు సార్లు తిరస్కరించింది. యూకేలో చట్టం ప్రకారం.. ఏదైనా కొత్త విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందులో మరో దారి లేకనే నీరవ్.. ఆరోగ్య సమస్యలను సాకుగా చూపిస్తూ హెల్త్ కార్డు ద్వారా జైల్లో నుంచి బయటపడాలని చూస్తున్నాడని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.
మరోవైపు నీరవ్ మోడీని తిరిగి భారత్ అప్పగించే విషయంలో భారతీయ దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు.. నీరవ్ మోడీ పాస్ పార్టును రద్దు చేయడమే కాకుండా, రెడ్ కార్నర్ నోటిసులు కూడా జారీ చేసింది. నీరవ్ భారత్‌కు అప్పగించాలనే కేసు లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. అరెస్టయినప్పటి నుంచి నీరవ్ వాండ్స్‌వర్డ్ జైలులో ఉంటున్నాడు.