రూ.2వేలకు పైగా UPI చేస్తే వారికి జీఎస్టీ పడుతుందా?.. నోటీసులు వస్తాయా? కేంద్రం క్లారిటీ..
UPI GST Tax : రూ.2వేల కన్నా ఎక్కువ యూపీఐ ఆధారిత లావాదేవీలపై GST పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

UPI GST Tax
UPI GST Tax : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ చెల్లించాలంటూ గతకొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో యూపీఐ (UPI GST Tax) వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. రూ.2వేల కన్నా ఎక్కువ యూపీఐ పేమెంట్లపై జీఎస్టీ చెల్లించాలంటూ వార్తలు వచ్చాయి.
అయితే, ఇప్పుడు దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆధారిత లావాదేవీలపై వస్తువులు, సేవల పన్ను (GST) విధించే ప్రణాళిక లేదని కేంద్రం తెలిపింది. రూ.2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని GST కౌన్సిల్ ఎలాంటి సిఫార్సు చేయలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు.
జీఎస్టీ నోటీసులపై కేంద్రం క్లారిటీ :
రూ.2,000 కన్నా ఎక్కువ యూపీఐ లావాదేవీలపై GST విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా అనేదానిపై రాష్ట్ర మంత్రి సభలో వివరణ ఇచ్చారు. జీఎస్టీ రేట్లు, మినహాయింపులు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా కర్ణాటక మర్చంట్లకు GST డిమాండ్ నోటీసులు అందిన తర్వాత కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.
కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు జారీ చేసిన GST నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గత వారమే పేర్కొన్నారు. పన్ను నోటీసులు జారీ చేయడంపై రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వాదనపై జోషి హాస్యాస్పదంగా అభివర్ణించారు.
కర్ణాటకలో జీఎస్టీ బకాయిలపై నోటీసులు :
చిన్న వ్యాపారులకు కర్ణాటక వాణిజ్య పన్ను అధికారులు జీఎస్‌టీ బకాయిల నోటీసులు జారీ చేశారని కేంద్ర మంత్రి జోషి అన్నారు. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందులో తన ప్రమేయం లేదని నమ్మిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నోటీసులు జారీ చేసి ఉంటే.. అనేక ఇతర రాష్ట్రాల మర్చంట్లకు కూడా అందేవని కేంద్ర మంత్రి జోషి ప్రశ్నించారు. కానీ, ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదన్నారు.
ఈ నోటీసులు కర్ణాటకలో మాత్రమే ఎందుకు పంపారో చెప్పాలన్నారు. వాస్తవానికి, జీఎస్‌టీలో రెండు భాగాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కింద సీజీఎస్‌టీ (సెంట్రల్ జీఎస్‌టీ), రాష్ట్ర ప్రభుత్వాల కింద ఎస్‌జీఎస్‌టీ (స్టేట్ జీఎస్‌టీ) ఉన్నాయని చెప్పారు. ఈ నోటీసులను కర్ణాటకలోని చిన్న వ్యాపారులకు రాష్ట్ర వాణిజ్య పన్ను శాఖ జారీ చేసిందని స్పష్టం చేశారు.