Hyderabad: భాగ్యనగరం లెక్కే వేరు.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువ

దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్‌లో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు ఉన్నాయని ప్రముఖ రియాల్టీ అనలైటిక్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది.

Hyderabad: భాగ్యనగరం లెక్కే వేరు.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువ

property and housing rates affordable in hyderabad

Property Rates Hyderabad : భారత్‌లో ఇళ్ల ధరలు (Housing Rates) క్రమంగా పెరిగిపోతున్నాయి. భూముల ధరల పెరుగుదల, నిర్మాణ వ్యయం పెరగడంతో గృహాల ధరల్లో మార్పు వస్తోంది. అయితే దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ పరిసరాల్లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయని రియాల్టీ రంగానికి (Real Estate) సంబంధించిన జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇళ్ల ధరల విషయంలో భాగ్యనగరం లెక్కే వేరంటున్నాయి.

సొంతిళ్లు అందరి కల. అయితే ఇల్లు కొనుగోలు చేసే సమయంలో ఆర్థిక, రియల్ రంగ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటి ధరలు ఎప్పుడూ పెరగడమే కాని తగ్గడం మాత్రం కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరుగుతూ పోతున్నాయి. అయితే దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్‌లో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు ఉన్నాయని ప్రముఖ రియాల్టీ అనలైటిక్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది.

హైదరాబాద్ భారీగా విస్తరిస్తున్న క్రమంలో శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. నగరం నడిబొడ్డునే కాదు సిటీ చుట్టూ జోరుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో భాగ్యనగరం శివారు ప్రాంత జిల్లాల్లో సామాన్య, మధ్య తరగతి వారు కొనగలిగే స్థాయిలో ఇళ్ల ధరలు ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా స్పష్టం చేసింది. అయితే హైదరాబాద్‌లోని ఐటీ హబ్ ఉన్న వెస్ట్ జోన్ పరిసరాల్లో మాత్రం ఇంటి ధరలు భారీగానే ఉన్నాయి. మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, గండిపేట, కోకాపేట్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ వంటి ప్రాంతాలతో పాటు సెంట్రల్‌ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట్ వంటి ప్రాంతాల్లో ప్రీమియం ఇంటి ధరలు సగటున చదరపు అడుగు రూ.10,140గా ఉందని క్రెడాయ్‌-కొలియర్స్‌ ఇండియా 2023 నివేదిక చెబుతోంది. అదే ముంబైలో ప్రీమియం ఇంటి ధరలు సగటున చదరపు అడుగులు రూ.19,219గా ఉంది. అంటే ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇంటి ధరలు తక్కువగానే ఉన్నాయని క్రెడాయ్ కొలియర్స్ స్పష్టం చేసింది. హైదరాబాద్ వెస్ట్ జోన్‌లో డబుల్ బెడ్‌రూమ్‌ ఇంటి ధర సుమారుగా కోటి రూపాయల నుంచి మొదలవుతోంది.

Also Read: తెలంగాణలో ప్లాట్లు, ఇళ్ల కొనుగోలుదారులకు రెరాతో రక్షణ.. ఎలాగో తెలుసా?

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే అందుబాటులోనే ఇంటి ధరలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. గ్రేటర్ శివారు పరిసరాల్లో మరీ ముఖ్యంగా ఔటర్‌ రింగ్ రోడ్డు పరిసరాల్లో సగటు ఇంటి ధర చదరపు అడుగు రూ.3,800గా ఉంది. హైదరాబాద్ శివారు జిల్లాలైన మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి జిల్లాల్లో మధ్య తరగతి వారు కొనుక్కోగలిగే స్థాయిలోనే ఇళ్ల ధరలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇంటి ధర సగటున రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల్లో మొదలవుతోంది. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి 8 నుంచి 12 శాతం ఇంటి ధరలు పెరిగాయి. అందుకే ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఇళ్లకు భారీ డిమాండ్.. ఎందుకో తెలుసా!

నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కూలీ పెంపు వంటి పరిణామాలతో పాటు భూముల ధరలు పెరగడం కూడా ఇంటి ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలోని మిగతా మెట్రోనగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటం మంచి పరిణామమని, అందుకు అనుగుణంగానే భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందని అంటున్నారు.