SurfExcelను బ్యాన్ చేయాలా? ఎందుకు?

ఇంటర్నెట్ ప్రపంచం.. అందునా సోషల్ మీడియా ప్రపంచంలో చిన్న విషయం అయినా కూడా హడావిడి చేసి విషయాన్ని పెద్దది చేసేస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియా ఎఫెక్ట్ బట్టలు ఉతికే సర్ఫు కంపెనీ సర్ఫ్ ఎక్సెల్‌పై పడింది. హిందుస్థాన్ యూనీ లివర్ కంపెనీ తీసిన కుంభమేళా యాడ్‌పై పాజిటివ్ రెన్సాన్స్‌తోపాటూ తీవ్ర విమర్శలు రాగా.. తాజాగా అదే కంపెనీకి చెందిన సర్ఫ్‌ఎక్సెల్ ప్రొడక్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం చూస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. హిందువుల పండుగైన హోలీకి సంబంధించి సర్ఫ్‌ఎక్సెల్ బ్రాండ్ ఓ యాడ్ రూపొందించి యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది. రెండు వారాల్లోనే ఆ యాడ్ 78 లక్షల వ్యూస్‌తో ఆ యాడ్ దుమ్ము రేపింది. అయితే ఆ యాడ్‌పై ఇప్పుడు హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా యాడ్ ఉందని, ఆ యాడ్ తీసిన సర్ఫ్ ఎక్సెల్ ప్రొడక్టును నిషేధించాలంటూ ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. #BoycottSurfExcel అనే హ్యాష్ ట్యాగ్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు.
అసలు యాడ్‌లో ఏముందంటే.. ఒక అమ్మాయి సైకిల్‌పై ఉంటే వీధిలో పిల్లలు తనపై హోలీ రంగులు వేస్తుంటే… ఇంకా ఇంకా వెయ్యమని రెచ్చగొడుతుంది. దాంతో పిల్లలంతా… తమ దగ్గరున్న అన్ని రంగులన్నీ చల్లేస్తారు. చివరకు వాళ్ల దగ్గరున్న రంగులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఓ ముస్లిం చిన్నారిని పాప ఇంట్లోంచీ బయటకు రమ్మంటుంది. ఆ చిన్నారిని సైకిల్‌పై ఎక్కించుకుని మసీదు దగ్గర వదిలేస్తుంది. ఈ యాడ్ చివర్లో మరక మంచిదే అని చెప్పడం వివాదమైంది. హిందువులు మరకలు పూసుకుంటుంటే… ముస్లింలు స్వచ్ఛంగా ఉంటున్నారనే అర్థం ఇందులో ఉందని హందుత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాల్ని దెబ్బతీసిన సర్ఫ్ ఎక్సెల్‌ని బాయ్‌కాట్ చెయ్యాలంటూ పిలుపిస్తున్నారు. అయితే ఈ యాడ్ గురించి SurfExcel మాత్రం తన వివరణ తాను ఇచ్చుకుంది. హిందూ-ముస్లింల ఐకమత్యాన్ని చాటేలా తమ యాడ్ ఉందని, హిందువులను కించపరచలేదంటూ చెప్పుకొచ్చింది.