టాటా V/S మిస్రీ….NCLAT తీర్పుపై సుప్రీం స్టే

సైరన్ మిస్రీని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా తిరిగి నియమించిలంటూ గతేడాది డిసెంబర్ 18న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం(జనవరి-10,2020) ఈ తీర్పునిచ్చింది. NCLAT నిర్ణయం “ప్రాథమిక లోపాలతో ఉందని,తాము ఈ మేటర్ ని వివరంగా వినాలనుకుంటున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది.
రతన్ టాటా తర్వాత 2012లో కంపెనీ ఆరో చైర్మన్‌గా మిస్త్రీ నియమితులయ్యారు. అయితే ప్రపంచంలోనే అత్యంత చౌక కారు టాటా నానో సహా కీలక పెట్టుబడులపై నిర్ణయాల్లో రతన్ టాటా, మిస్త్రీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. సంపన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబ వారసుడైన మిస్త్రీని… 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అనూహ్యంగా తొలగించారు. దీంతో కంపెనీల చట్టం కింద ఆయన న్యాయ పోరాటానికి దిగారు. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించడంతో పాటు ప్రస్తుత టాటా గ్రూప్ అధినేత ఎన్. చంద్రశేఖరన్ నియామకాన్ని రద్దు చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) డిసెంబర్-18,2019న తీర్పు వెలువరించింది.
చంద్రశేఖరన్ నియామకం ‘‘చట్టవిరుద్ధమని’’ ఎన్‌సీఎల్ఏటీ స్పష్టం చేయడంతో మళ్లీ కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు మిస్త్రీకి మార్గం సుగమం అయ్యింది. అయితే టాటా కంపెనీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా నాలుగు వారాల పాటు తన తీర్పు అమలుపై ఎన్‌సీఎల్ఏటీ స్టే విధించింది. దీంతో జనవరి-2,2020న NCLAT ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే కంపెనీలో మళ్లీ చేరే ఉద్దేశం లేదని ఇటీవల సైరస్ మిస్త్రీ వెల్లడించిన విషయం తెలిసిందే.