మాంసం వినియోగంలో తెలంగాణ టాప్‌ 

దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 03:47 AM IST
మాంసం వినియోగంలో తెలంగాణ టాప్‌ 

దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.

హైదరాబాద్‌ : తెలంగాణలో మాంసం ప్రియులు అధికంగా ఉన్నారు. దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. డిసెంబర్‌ 31తో ముగిసిన జాతీయ పశుగణనకు సంబంధించిన నివేదికలో పలు వివరాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో వాటి సంఖ్య పెరగడమే కాకుండా మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 

ఏడాది సగటున రాష్ట్రంలో 26,839 మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి రోజుకు దాదాపు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 100కు పడిపోవడం గమనార్హం. గొర్రెల సంఖ్య పెరగడమే కాకుండా మాంసం వినియోగంలోనూ తెలంగాణ టాప్ గా నలిచింది. 

మాంసహారం తీసుకునేవారిలో సగటున ప్రతి వ్యకి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వినియోగించాల్సి ఉంది. తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కిలోలు చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.