భార్యను కాపురానికి పంపమని హోర్డింగ్ ఎక్కిన భర్త

  • Published By: murthy ,Published On : October 23, 2020 / 11:45 AM IST
భార్యను కాపురానికి పంపమని హోర్డింగ్ ఎక్కిన భర్త

Updated On : October 23, 2020 / 12:21 PM IST

Hyderabad : రోజూ తాగి వచ్చి కుటుంబాన్నినిర్లక్ష్యం చేస్తున్న భర్తను వదిలేసి, పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను మళ్లీ తనతో కాపురానికి పంపించటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ వ్యక్తి అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు.

హైదరాబాద్, రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లికి చెందిన బెల్లంపల్లి రాజు(38) కి 12 ఏళ్ల క్రితం చాంద్రాయణ గుట్టకు చెందిన భాగ్యతో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యానికి బానిసైన రాజు …రోజు తాగి వస్తుండటం… కుటుంబం గురించి సరిగా పట్టించుకోక పోవటంతో గత రెండేళ్లుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.



భార్య తాగుడు మానమని చెప్పినా వినకుండా రోజూ తాగి వస్తుండటంతో విసిగిపోయిన భాగ్య కొంతకాలం క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాజు ఒక్కడే నివసిస్తున్నాడు. ఇటీవల భార్యను తన వద్దకు వచ్చేలా చూడమని రాజు మైలార్ దేవ్ పల్లి పోలీసులను కోరాడు. వారు ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ భర్త వ్యవహార శైలి నచ్చక భాగ్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉంటోంది.

తాను విజ్ఞప్తిచేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని రాజు శుక్రవారం ఉదయం సైబరాబాద్ కమీషనరేట్ వద్దకు వచ్చాడు. కమీషనరేట్ ఎదురుగా ఉన్న పబ్లిసిటీ హోర్డింగ్ టవర్ ఎక్కి భార్యను తనతో పంపించమంటూ హడావిడి చేశాడు. రాయదుర్గం పోలీసులు కిందకు దించేందుకు యత్నించినప్పటికీ విఫలమయ్యారు. చివరికి చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి భాగ్యను తీసుకురావటంతో కధ సుఖాంతమై…. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.