Red Sandalwood Smuggling : పుష్ప 2 సినిమా స్టైల్ లో.. ఏపీలో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు..
ఎర్రచందనం దుంగలు లెక్కించగా మొత్తం 89 ఉన్నాయి. మార్కెట్ లో వాటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు

Red Sandalwood Smuggling : నెల్లూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా.. పుష్ప 2 సినిమా స్టైల్ లో వాటిని స్వాధీనం చేసుకున్నారు రాపూరు రేంజ్ అధికారి రవీంద్ర బాబు. రాపూరు-మద్దెలమడుగు అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఓ ట్రక్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 15 లక్షల విలువ చేసే 89 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
రాపూరు రేంజ్ అధికారి రవీంద్ర బాబు ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి ట్రక్ లో వరి గడ్డి మాటున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
అటవీ శాఖ అధికారులు తనిఖీ కేంద్రం దగ్గర తనిఖీలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఓ ట్రక్ వచ్చింది. అందులో వరి గడ్డి ఉంది. అయితే అటవీశాఖ అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. అంతే, వరి గడ్డి తొలగించి చూశారు. గడ్డి తొలగించి చూడగా షాక్ కొట్టినంత పనైంది. గడ్డి కింద పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం బట్టబయలైంది.
Also Read : ఏపీలో త్వరలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఇవే.. సరికొత్త డిజైన్, ప్రత్యేకతలు ఏంటంటే..
ఎర్రచందనం దుంగలు లెక్కించగా మొత్తం 89 ఉన్నాయి. మార్కెట్ లో వాటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అటవీశాఖ అధికారులు. ఎర్రచందనం స్మగ్లర్ల తెలివితేటలకు అధికారులు విస్తుపోయారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా స్మగ్లింగ్ చేసేందుకు స్కెచ్ వేశారు. వాహనం మొత్తం గడ్డితో నింపేశారు. ఎవరైనా చూసినా అందులో గడ్డి తప్ప ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, అధికారుల ముందు వారి పన్నాగం పారలేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు.