లారీ బీభత్సం : శ్రీశైలం వెళుతూ అనంతలోకాలకు

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట వాహనాలు బీభత్సం సృష్టిస్తుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదాలకు కారణమౌతున్నాయి. తాజాగా శ్రీశైలంలో లారీ బీభత్సం సృష్టించింది. భక్తులపైకి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
బళ్లారి జిల్లా మోక మండలం ఎర్రగూడి గ్రామానికి చెందిన కొంతమంది మోక నుండి శ్రీశైలానికి నడుచుకుంటూ వెళుతున్నారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల వద్దకు రాగానే లారీ అదుపు తప్పి వారిపైకి దూసుకొచ్చింది. ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఉలిగయ్య, పోతుల లింగయ్య, శేఖర్‌లు మృతి చెందిన వారిలో ఉన్నారు. రహదారిపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి గురైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.