భారత్ లో తొలి కరోనా మరణం!

  • Published By: venkaiahnaidu ,Published On : March 11, 2020 / 08:51 AM IST
భారత్ లో తొలి కరోనా మరణం!

Updated On : March 11, 2020 / 8:51 AM IST

కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న కర్ణాటకలోని కలబురిగికి చెందిన ఓ వ్యక్తి ఇవాళ(మార్చి-11,2020)ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తిని 76ఏళ్ల మొహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీగా అధికారులు గుర్తించారు. చనిపోయిన వ్యక్తి  యొక్క శాంపిల్స్ ను బెంగళూరులోని ల్యాబ్ కు పంపించారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

సౌదీ అరేబియాకు యాత్ర కోసం వెళ్లిన సిద్దిఖీ ఇటీవల సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చాడు. రిపోర్టులు వచ్చిన తర్వాతే ఆయన కరోనా సోకి మరణించాడా లేక ఇంకేదైనా కారణంతో మకరణించాడా అన్నది తెలియాల్సి ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 62కి చేరింది.(ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు?)

మరోవైపు కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్‌పైనా పడే సూచనలు కన్పిస్తున్నాయ్. మెగా ఈవెంట్‌ను వాయిదా వేయమని కేంద్రానికి లేఖ రాసింది కర్నాటక ప్రభుత్వం. బెంగళూరులో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో బెంగళూరులో మ్యాచులు నిర్వహించే అవకాశాలు లేవని భావిస్తున్నారు.

మరోవైపు బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఐపిఎల్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని ప్రకటించారు. అయితే… కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో..ఐపిఎల్ నిర్వహణపై  కొన్నిరోజుల్లో స్పష్టత రానుంది.