ఉద్యోగంలో చేరిన 3నెలలకే : రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 11:18 AM IST
ఉద్యోగంలో చేరిన 3నెలలకే : రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

Updated On : January 3, 2020 / 11:18 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేశారు. నిర్మాణదారు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్‌ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, చంద్రశేఖర్ జాబ్ లో చేరి మూడు నెలలు మాత్రమే అవుతోంది. ఇంతలోనే అవినీతికి తెరలేపాడు. అప్పుడే చేతులు తడపడం మొదలు పెట్టాడు. ఉద్యోగంలో చేరిన 3 నెలలకే ఇలా ఏసీబీకి చిక్కడం విస్మయానికి గురి చేసింది.

ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు లంచాలకు రుచి మరిగారని, చేయి తడపనిదే ఏ పనీ చెయ్యడం లేదంటున్నారు. లంచం ఇవ్వకపోతే పనులు పెండింగ్ లో పెడుతున్నారని, కాళ్లరిగేలా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ హెచ్చరించినా.. జైలు శిక్షలు విధిస్తున్నా.. కొందరు ప్రభుత్వ అధికారుల్లో మార్పు రావడం లేదు. అవినీతి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పెద్దగా ఫలితం ఉండటం లేదు.

ఓవైపు పని చేసినందుకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నారు… కొందరు ఉద్యోగులు అడ్డదారి తొక్కుతున్నారు. యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలకు అలవాటుపడ్డారు. ఇలాంటి ఘటనల్లో కొంతమంది బాధితులే ధైర్యంగా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మిగతావారు.. ఎందుకొచ్చిన గొడవ అంటూ.. లంచం ఇచ్చి పని కానిచ్చుకుంటున్నారు.

Also Read : విశాఖ టూర్‌తో జగన్‌ మౌనం.. సీఎం మదిలో ఏముంది?