ఆగని పౌర”రణం” : వాహనాలకు నిప్పు…పోలీసుల కాల్పులు

పౌరసత్వ సవరణ చట్టాని వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న ఢిల్లీలోని జామియా మిలియా, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మవూ జిల్లాలో సోమవారం(డిసెంబర్-16,2019)నిరసనకారులకు,పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ,ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు రోడ్లపైన వాహనాలను తగులపెట్టడం, పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టారు.
ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. పరిస్థితులు కంట్రోల్ చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. అయితే తాజా ఘర్షణల నేపథ్యంలో మవూ జిల్లాలో పోలీసులు అప్రకటిత కర్ఫ్యూ విధించారు. అయితే, కర్ఫ్యూ విధించలేదని,నిషేధ ఉత్వర్వులు కఠినంగా అమలు చేస్తున్నామని డీజిపీ ఓపీ సింగ్ తెలిపారు. ఒకే ప్రాంతంలో ప్రజలు గుమిగూడేందుకు అనుమతించడం లేదని, ప్రస్తుతం ఎలాంటి సమస్యా లేదని ఆయన తెలిపారు.
మరోవైపు జామియా మిలియా,అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ఇవాళ దేశారాజధానిలో ఇండియా గేట్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరకేంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇవాళ(డిసెంబర్-16,2019)రాజధాని కోల్ కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే.