హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం… మృతుడి కళ్లు పీక్కుతిన్న చీమలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2019 / 01:34 PM IST
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం… మృతుడి కళ్లు పీక్కుతిన్న చీమలు

Updated On : October 16, 2019 / 1:34 PM IST

శివపురి జిల్లా హాస్పిటల్ లో జరిగిన ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ తీవ్రంగా స్పందించారు. ఓ రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు. హాస్పిటల్ లో మృతి చెందిన రోగి మృతదేహం కంటిని చీమలు పీక్కుతుంటున్నా పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది వైఖరిపై విచారణకు ఆదేశించారు.  ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం మానవత్వానికి సిగ్గుచేటని కమల్ నాథ్ అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని,కఠినచర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ సర్జర్‌తో సహా అయిదుగురు మెడికోలపై సస్పెన‍్షన్‌ వేటు పడింది. 

మంగళవారం ఉదయం తీవ్రమైన క్షయ వ్యాధితో బాధపడుతున్న బాల్‌చంద్ర లోధి  శివపురి జిల్లా హాస్పిటల్ లో చేరారు. చేరిన ఐదు గంటల లోపు అతడు మృతి చెందారు. దీంతో అదే వార్డులో చికిత్స పొందుతున్న సదరు రోగులు హాస్పిటల్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది మృతదేహన్ని తీయటం పట్ల నిర్లక్ష్యం వహించారు. మృతదేహాన్ని మార్చరీకి తరలించకుండా అదే వార్డులో ఓ మూలగా పడేశారు.

ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్‌ కూడా రోగి మృత దేహాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ మృతదేహంపై చీమలు పాకుతూ.. కళ్లను పీకే ప్రయత్నం చేశాయి.  దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతుడి భార్య ఆ చీమలను పారదోలింది. ఈ సంఘటన మొత్తాన్ని రికార్డు చేసిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అవుతోంది.