డబ్బు వెదజల్లారు : ATM వ్యాన్ నుంచి రూ.58 లక్షలు చోరీ
హైదరాబాద్ నగరంలో ఏటీఎంలలో డబ్బు నింపే కస్టోడియన్ వ్యాన్ నుంచి సుమారు రూ.58 లక్షల రూపాయలు దోపిడీ చేశారు ఓ దొంగల ముఠా సభ్యులు.

హైదరాబాద్ నగరంలో ఏటీఎంలలో డబ్బు నింపే కస్టోడియన్ వ్యాన్ నుంచి సుమారు రూ.58 లక్షల రూపాయలు దోపిడీ చేశారు ఓ దొంగల ముఠా సభ్యులు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఏటీఎంలలో డబ్బు నింపే కస్టోడియన్ వ్యాన్ నుంచి సుమారు రూ.58 లక్షల రూపాయలు దోపిడీ చేశారు ఓ దొంగల ముఠా సభ్యులు. సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చి చాకచక్యంగా తమ పని కానిచ్చుకున్నారు. మంగళవారం ఉదయం పదిన్నర సమయంలో వనస్ధలిపురంలోని పనామా గొడౌన్స్ వద్ద విజయవాడ జాతీయ రహాదారిపై ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు నింపటానికి, బేగంపేట కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కు చెందిన కస్టోడియన్ వ్యాన్ చేరుకుంది. వ్యాన్ లోవచ్చిన ఇద్దరు కస్టోడియన్లు..మహ్మద్ థా, విజయ్.. డబ్బు నింపేందుకు ఏటీఎం లోకి వెళ్లారు. వ్యాన్ డ్రయివర్ సత్తికుమార్ దిగి పక్కకు వెళ్ళాడు. సెక్యూరిటీ గార్డు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నాగేందర్ వ్యానులోనే ఉన్నాడు.
ఇంతలో ముగ్గురు వ్యక్తులు వ్యాన్ వద్దకు వచ్చారు. అందులో ఒకడు ఎవరూ చూడకుండా రోడ్డు మీద 100, 10 రూపాయల నోట్లను చల్లుకుంటూ వచ్చి, రోడ్డు మీద నోట్లు పడిపోయాయని వ్యాన్ లో కూర్చున్న సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. డబ్బులు పడిపోయాయని చెప్పగానే …. సెక్యూరిటీ గార్డు హడావిడిగా వ్యాన్ దిగి డబ్బు ఏరుకుంటూ ఏటిఎం వైపు వెళ్ళాడు. ఇదే అదునుగా తమ ప్రణాళిక అమలు చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు.
వ్యాన్ లోని నగదు ఉన్న పెట్టెను వేరే డోర్ ద్వారా దించాడు ముఠాలోని ఒక సభ్యుడు. అలా పెట్టెను ఎత్తుకుని రోడ్డుకు అవతలివైపు ఉన్న పనామా గొడౌన్ బస్టాప్ వద్దకు వెళ్లాడు (హయత్ నగర్-హైదరాబాద్ జాతీయ రహాదారి). ఈలోపు మిగతా వారు కూడా రోడ్డు దాటుకుని అదే బస్టాప్ కు చేరుకున్నారు. ఇదంతా గమనించని గార్డు వ్యాన్ వద్దకు వచ్చి చూడగా లోపల ఉండాల్సిన నగదు పెట్టే మాయం అయ్యింది. నగదు పోయిన సంగతిని వైటర్ సేఫ్ గార్డ్ సిబ్బంది వనస్ధలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాచకొండ అదనపు కమీషనర్ సుధీర్ బాబు, ఎల్బీ నగర్ డీసీసీ సన్ ప్రీత్ సింగ్, ఏసీపీలు గాంధీ నారాయణ, పృధ్వీధర్ రాలు ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. లభించిన సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది మంది ఈ ఘటనకు పాల్పడి వుండవచ్చని భావిస్తున్నారు. పక్కా స్కెచ్ ప్రకారం డబ్బు కాజేసిన నిందుతులు అక్కడి నుంచి ఎల్బీ నగర్ వరకు ఆటోలో వచ్చి అక్కడి నుంచి దిగి వేరే ఆటోలో దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజిలో గుర్తించారు పోలీసులు. ముందుగానే రెక్కీ నిర్వహించి , ఏటియంలో డబ్బు నిపంటానికి సిబ్బంది వస్తారని ముందుగానే పసిగట్టి దొంగలు అక్కడకు చేరుకున్నారు.
ఈ ఘటనకు ముందు దుండగులు సమీపంలోని ఖానాఖాజానా రెస్టారెంట్ లో బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు సొంత వాహనంలేకుండా షేర్ ఆటోలలో పనికానిచ్చుకుని వెళ్లటం, హిందిలో మట్లాడటం వంటివి చూస్తుంటే అంతరాష్ట్ర దొంగతనాల్లోఆరితేరిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు కస్టోడియన్ వ్యాన్‌ను బేగంపేట నుంచి వెంబడిస్తున్నారా లేదా ఎవరైనా సమాచారం ఇచ్చి ఉంటారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్‌లో ఉన్న సిబ్బందిని కూడా పోలీసులు విచారించారు. మొదట రూ. 70 లక్షలు చోరీ జరిగాయని భావించినా, రూ.58 లక్షల రూపాయలుగా లెక్క తేలింది.