భారీ మోసం : కోళ్ల పందేలలో దొంగ నోట్ల కలకలం
విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు

విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు
విజయవాడ: భారీ మోసం.. అలాంటి ఇలాంటి మోసం కాదు.. పందెపు రాయుళ్ల దిమ్మతిరిగిపోయే ఘరానా మోసం ఇది. బెట్టింగ్ బంగార్రాజులు దారుణంగా మోసపోయిన వైనం వెలుగులోకి వచ్చింది. దొంగ నోట్ల ముఠాలు పందెపు రాయుళ్ల కొంపముంచాయి. నకిలీ నోట్లతో వారిని నిలువునా ముంచేశారు. కోళ్ల పందెలు, జూదక్రీడల్లో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున చేతులు మారింది.
సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు భారీగా ఆడారు. పందేలు చూసేందుకు జూదప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోళ్ల పందేల ముసుగులో జూదరాయుళ్లు చెలరేగిపోయారు. భారీగా బెట్టింగ్‌లు కాశారు. పండుగ మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా 2వేల 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌లు జరిగాయి. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. పందెంలో గెల్చినవాళ్లు తమకు వచ్చిన డబ్బు చూసుకుని తెగ మురిసిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత వారికి దిమ్మతిరిగిపోయే నిజం తెలిసింది. కోళ్ల పందేలలో తాము గెల్చిన నగదులో పెద్ద సంఖ్యలో దొంగ నోట్లు ఉన్నాయని తెలిసి కంగుతిన్నారు. అది ఫేక్ కరెన్సీ అని తెలిసి లబోదిబోమంటున్నారు. దారుణంగా మోసపోయామని తెలిసి తెగ ఫీలవుతున్నారు. బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు.
కృష్ణాజిల్లా వనుకూరుకి చెందిన శ్రీనివాస్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈడ్పుగల్లులో నిర్వహించిన కోళ్ల పందెంలో శ్రీనివాస్ బెట్టింగ్ కాశాడు. 15వేల రూపాయలు గెల్చుకున్నాడు. పందెంలో గెల్చిన క్యాష్ తీసుకుని హ్యాపీగా ఇంటికెళ్లాడు. అయితే అవన్నీ నకిలీ నోట్లు అని తెలిసి నెత్తినోరు బాదుకుంటున్నాడు. పందెంలో గెల్చిన డబ్బుని బ్యాంకులో జమ చేయడానికి వెళితే శ్రీనివాస్‌కి షాకింగ్ నిజం తెలిసింది. డిపాజిట్ చేసేందుకు తెచ్చిన 15వేల రూపాయలలో 10వేల రూపాయల వరకు దొంగ నోట్లే ఉన్నాయి. 500, 2వేల రూపాయల నోట్ల చాలావరకు ఫేక్ కరెన్సీ అని తేలింది. ఇవి దొంగనోట్లు అనే విషయాన్ని బ్యాంకు సిబ్బంది స్వయంగా చెప్పారని శ్రీనివాస్ వాపోయాడు. చేసేది లేక మౌనంగా ఇంటికెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామా? అంటే అసలు బెట్టింగ్ కాయడమే పెద్ద నేరం. నకిలీ నోట్ల విషయం పక్కన పెడితే బెట్టింగ్ కాసినందుకు ముందు తనను అరెస్ట్ చేస్తారని శ్రీనివాస్ భయపడ్డాడు. దీంతో సైలెంట్‌గా ఉండిపోయాడు. ఒక్క శ్రీనివాసే కాదు ఇలా దారుణంగా మోసపోయిన బాధితులు చాలామందే ఉన్నారు. అయితే కోళ్ల పందేలు, జూదం చట్టరిత్యా నేరం కావడంతో వారెవరూ పోలీసులను ఆశ్రయించే సాహసం చేయడం లేదు.
దొంగ నోట్లు ముద్రించే కేటుగాళ్లు కోళ్ల పందెలను, జూదాన్ని బాగా క్యాష్ చేసుకున్నారు. కోళ్ల పందేలు, జూదం రహస్యంగా నిర్వహిస్తారు. మూడో కంటికి తెలియకుండా బెట్టింగ్ కాస్తారు. దీంతో బెట్టింగ్‌లో పెట్టిన డబ్బులో ఒరిజనల్ నోట్లు ఉన్నాయా? లేక నకిలీ నోట్లు ఉన్నాయా? అనేది ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. దీన్ని దొంగ నోట్ల ముద్రించే ముఠాలు సొమ్ము చేసుకున్నాయి. ఇదే అదనుగా భారీగా నకిలీ నోట్లు చెలామణి చేసేశారు.
కంచికచెర్ల పోలీసులు తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కోళ్ల పందేలు, పేకాట ఆడే స్థావరాలు దొంగ నోట్ల ముఠాలకు మంచి అడ్డాలని పోలీసులు చెప్పారు. నకిలీ నోట్లు చెలామణి చేయడానికి వారికి ఇదే బెస్ట్ స్పాట్ అని తెలిపారు. అందుకే సంక్రాంతి వచ్చిందంటే దొంగ నోట్లు ముద్రించే ముఠాలు పండగ చేసుకుంటాయని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లను కోళ్ల పందేలు, పేకాటలో చెలామణి చేసినట్టు ఆ గ్యాంగ్ సభ్యులు అంగీకరించారు.