Gang Rape Drama : ప్రేమించిన వ్యక్తి వేరోక యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడని……
ప్రేమించిన వ్యక్తి వేరోక యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడని ..అతడ్ని కేసులో ఇరికించేందుకు ఒక యువతి సామూహిక అత్యాచారం డ్రామా నడిపింది

Gang Rape
Gang Rape Drama : ప్రేమించిన వ్యక్తి వేరోక యువతిని పెళ్ళి చేసుకుంటున్నాడని ..అతడ్ని కేసులో ఇరికించేందుకు ఒక యువతి సామూహిక అత్యాచారం డ్రామా నడిపింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఫిర్యాదుకు సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఎక్కడా పొంతన కుదరక పోవటంతో సాక్ష్యులు దొరకలేదు. అయినా ఓర్పుగా కేసు విచారించిన పోలీసులు చివరికి యువతిపై ప్రశ్నల వర్షం కురిపించే సరికి నాటకం ఆడినట్లు నిజం ఒప్పుకుంది.
హైదరాబాద్ ఫిసల్‌బండకు చెందిన ఓ యువతి సంతోష్‌నగర్‌లో లాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ప్రతిరోజు రాత్రి గం.9-30కల్లా ఇంటికి వచ్చే యువతి ఈ నెల 17న రాత్రి 10.30గంటలకు ఇంటికి వచ్చింది. గంట ఆలస్యం అయ్యింది ఏంటని తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించడంతో…. తనపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో యువతితో కలిసి తల్లిదండ్రులు బుధవారం సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కేసు విచారణ చేపట్టిన సౌత్ జోన్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యాదగిరి థియేటర్ నుంచి పహాడీషరీఫ్ వరకు రోడ్లపై ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో వారికి ఎక్కడా యువతిపై అత్యాచారం జరిగిందనటానికి ఒక్క ఆధారం కూడా లభించలేదు. బాధితురాలి ఫిర్యాదుకు, సీన్ ఆఫ్ అఫెన్స్‌కు ఎక్కడా పొంతన కుదరట్లేదు. యువతి ఇంటివద్ద నుంచి, ఆమె పని చేసే డయాగ్నోస్టిక్ సెంటర్ రెండు కిలోమీటర్లు కూడా లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయినా దర్యాప్తులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలు ఆటో ఎక్కిన ప్రాంతం నుంచి ప్రధాన రహదారి, లింకు రోడ్లు , నిర్మానుష్య ప్రాంతాలకు దారితీసే చోట్ల సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. వాటిల్లో కనిపించిన ఆటోలు ఏ రోడ్డునుంచి ఏ రోడ్డులోకి వెళ్లాయో ఆరా తీశారు. సంతోష్‌నగర్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్ ప్రాంతాల్లో సెల్ టవర్ సిగ్నల్స్‌ను విశ్లేషించారు.
చాలా మంది ఆటో డ్రైవర్లనూ విచారించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు యువతిని పలు కోణాల్లో విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. తాను ప్రేమించిన వ్యక్తికి మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడని, ఆ కక్షతోనే అతడిని కేసులో ఇరికించేందుకు నాటకమాడినట్లు అసలు విషయాన్ని బయటపెట్టింది. మరో వైపు వైద్య పరీక్షల్లో యువతిపై అత్యాచారం జరుగలేదని తేలిందని సమాచారం.