పాపం పసివాడు… కుక్కల పాలయ్యాడు

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు కూడా నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తిన్న హృదయ విదారకసంఘటన కలవరం సృష్టించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఎస్‌ఐ బి. శ్రీనివాస్ అందించిన సమాచారం మేరకు… అలీ అస్గర్ అనే ప్రయివేటుసంస్ధలో పనిచేసే వ్యక్తి ఆదివారం తెల్లవారుజమున సుమారు గం.2-30 గంటల ప్రాంతంలో విధి నిర్వహణ ముగించుకుని బంజారాహిల్స్ రోడ్ నెం. 13లోని హిందూ శ్మశాన వాటిక ముందు నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కొన్ని కుక్కలు అరుస్తు కొట్టుకుంటు కనిపించాయి. అస్గర్ వాటిని తరిమేశాడు. అక్కడ పరిశీలించి చూడగా ఓ శిశువు కాళ్ళు, చేతులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండగా మెడంతా కోసుకుపోయింది. కుక్కలు శిశువును పీక్కు తింటున్నట్లుగా గుర్తించిన అతను బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువు శరీర భాగాలను ఒక్క చోటకు చేర్చి ఉస్మానియా మార్చురీకి తరలించారు. శిశువు వారం రోజుల క్రితం జన్మించి ఉండవచ్చునని శ్మశాన వాటిక పక్కన పడేసి వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. శిశువు వయస్సు వారం రోజులలోపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్మశానం లోంచి కుక్కలు శవాన్ని తీసుకు వచ్చాయ? లేక శవాన్నిఎవరైనా వదిలేసి వెళ్లారా అనే అంశాన్ని సీసీ పుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తిస్తామన్నారు.