మెడికల్ కాలేజీలో 10 మంది నవజాత శిశువులు సజీవదహనం.. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పది మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు. మరో 16మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

Newborn Babies Dead In UP
Newborn Babies Dead In UP : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పది మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు. మరో 16మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయు)లో శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో భయాందోళనలో తల్లిదండ్రులు తమ శిశువులను తీసుకొని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 54 మంది చిన్నారులు ఎన్ఐసీయూలో ఉన్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలింది. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఆస్పత్రి నిర్లక్ష్యంపై సమగ్ర విచారణకు ఝాన్సీ జిల్లా కలెక్టర్ అవినాశ్ కుమార్ ఆదేశించారు. తీవ్ర విషాదంపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని యోగి ఆధిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై తనకు పూర్తి నివేదిక అందజేయాలని డీఐజీని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ కార్యదర్శి పార్ధసారథి సేన్ శర్మ ఝాన్సీ ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
మంటలు వ్యాప్తితో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అర్ధరాత్రి 1గంట వరకు శ్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో 52 నుంచి 54 మంది చిన్నారులు ఎన్ఐసీయూలో చేరారని, అందులో 10మంది చనిపోయారని, 16 మందికి గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారని మెడికల్ కాలేజీ పేర్కొంది. 1968లో ప్రారంభమైన ఈ ప్రభుత్వ వైద్య కళాశాల బుందేల్ ఖండ్ ప్రాంతంలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటి.