మొన్న నరేశ్‌.. నిన్న ప్రణయ్‌..నేడు హేమంత్.. ప్రాణం కంటే పరువే ముఖ్యమా..? ఎన్నాళ్లీ పరువు హత్యలు..?

  • Published By: naveen ,Published On : October 2, 2020 / 11:05 AM IST
మొన్న నరేశ్‌.. నిన్న ప్రణయ్‌..నేడు హేమంత్.. ప్రాణం కంటే పరువే ముఖ్యమా..? ఎన్నాళ్లీ పరువు హత్యలు..?

Updated On : October 2, 2020 / 11:23 AM IST

Honour Killings: పరువు కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించాల్సిందేనా..? కులం, మతం, వంశం, గౌరవం, ప్రతిష్ట.. వీటి కోసం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీయాల్సిందేనా..? మరి ప్రాణం తీస్తే పోయిందనుకున్న పరువు తిరిగి వస్తుందా..? మొన్న నరేశ్‌.. నిన్న ప్రణయ్‌.. తాజాగా హేమంత్‌..ఈ ముగ్గురి ప్రాణాలు తీసినందుకు..పరువు తిరిగి వచ్చిందా..? ఈ ముగ్గురి ప్రాణాలు తీయించినోళ్లు హ్యాపీగా ఉన్నారా..?

పరువు కోసం ప్రాణం తీయాల్సిందేనా..? కులం ముందు ప్రేమ తల వంచాల్సిందేనా..? ప్రాణం కంటే పరువే ముఖ్యమా..? ప్రేమిస్తే..చంపేస్తారా..? చంపడమే ప్రేమా..? పరువంటే ఇదేనా..? ఎన్నాళ్లీ పరువు హత్యలు..? ఈ హత్యలకు అంతమెప్పుడు..?

పరువు…ఇప్పుడు ఇది సమాజానికి పట్టిన ఓ చీడ పురుగు. కులమతాలకు అతీతంగా రాకెట్ యుగంలోకి దూసుకెళ్తున్న యువతను కులం అనే అడ్డుగోడులు పరువు హత్యలు చేస్తున్నాయి. ఇందులో ఆర్ధికపరమైన పరువు ఒకటైతే…మరోటి కులం కార్డుతో పరువు ప్రాణాలు తీస్తోంది. ఈ పరువు హత్యలు…చివరకు కన్న ప్రేమనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.

ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు..?
అబ్బాయీ, అమ్మాయీ ప్రేమించుకోవడం, అటువైపో…,ఇటువైపే ఎవరో ఒకరి కుటుంబానికి నచ్చకపోవడం, ఆపై అయినవాళ్లనే చంపేయడం…కని పెంచి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసిన మమ్మల్నే తిరస్కరిస్తారా…అనే తట్టుకోలేని భావనతో తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. కానీ వయసొచ్చిన పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తాయని ఆలోచించట్లేదు. మా మాటే వినాలి, మేం చెప్పినట్లే నడుచుకోవాలనే ధోరణి…పంతాలకు దారితీసి, ప్రాణాలను హరిస్తోంది.

తమకు ఇష్టం లేని వివాహాలు చేసుకున్నారంటూ..ఓ చోట కూతుర్ని ప్రేమించినోడిని..మరో చోట కన్న కూతుర్ని సైతం.. హతమార్చడానికి తల్లిదండ్రులు వెనుకాడకపోవడం అత్యంత దారుణ విషయం. ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు..? పరువు కోసం పాకులాడి, ప్రాణాలు తీసి, జీవితం జైలుపాలు చేసుకుని…అయినవాళ్లు సాధించేదేంటి..?

పరువు తీశాడన్న కారణంతోనే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చింది:
హేమంత్‌ను హత్య చేయించిన లక్ష్మారెడ్డి మాటలు ఓ సారి వినండి. అవంతి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కట్టడి చేశాం. కానీ అవంతి తెలియకుండా వెళ్లిపోయి హేమంత్‌ను పెళ్లి చేసుకుంది. పోలీసుల ద్వారా అవంతి పెళ్లి విషయం మాకు తెలిసింది. 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేంధర్‌తో మాటలు లేవు. హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది.

ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యం. అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది. పరువు తీశాడన్న కారణంతోనే హేమంత్‌ను హత్య చేయాల్సి వచ్చింది. పోలీసుల విచారణలో లక్ష్మారెడ్డి చెప్పిన మాటలవి.

హేమంత్‌ హత్యతో పరువు తిరిగి వచ్చిందా..? కాలనీలో తల ఎత్తుకుని తిరుగుతున్నాడా..?
అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు లక్ష్మారెడ్డి. సరే.. కాసేపు అదే నిజమనుకుందాం. మరి హేమంత్‌ను చంపిస్తే..ఆయన పరువు తిరిగి వచ్చిందా..? ఎక్కడైతే తలదించుకోవాల్సి వచ్చిందో…ఈ హత్యతో ఇప్పుడు ఆ కాలనీలో తల ఎత్తుకుని తిరుగుతున్నాడా..? తమ కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యమని చెప్పుకునే లక్ష్మారెడ్డి.. ఇకపై తన ఆధిపత్యాన్ని అలాగే కొనసాగిస్తాడా..?

హత్యకు ముందు పరువు పోయిందని కేవలం అతడుంటున్న కాలనీ వరకు తెలిసి ఉండొచ్చు.. కానీ ఈ హత్య చేయించి తెలుగు రాష్ట్రాలే కాదు దేశ వ్యాప్తంగా తన పరువు పోయిందంటూ తానే చెప్పుకున్నాడు. పరువు కోసం పాకులాడి అటు కూతురి జీవితాన్ని నాశనం చేయడమే కాదు..తన జీవితాన్ని సైతం నాశనం చేసుకున్నాడు.

ప్రేమించినోడిని చంపేస్తే కూతురి తిరిగి వస్తుందని ఎలా అనుకున్నారు..?
కూతురు అంటే ఆ తల్లిదండ్రులకు ప్రేమ ఉండొచ్చు. ప్రేమ వివాహం లేదా కులాంతరం వివాహం చేసుకోవడం నచ్చకపోవొచ్చు. అంత మాత్రాన కూతురు ప్రేమించోనొడి ప్రాణం తీయాల్సిందేనా..? దానికి వేరే పరిష్కార మార్గమే లేదా..? ప్రేమ..పెళ్లి విషయంలోనే..తల్లిదండ్రులను ఎదిరించి..ప్రియుడితో వెళ్లిపోయింది అవంతి. ప్రేమించినోడి కోసం తల్లిదండ్రులను సైతం వదులుకుంది.

అప్పుడే తల్లిదండ్రులను వద్దనుకుని వెళ్లిన అవంతి…ప్రేమించినోడి ప్రాణం తీస్తే..తమ వద్దకు వస్తుందని ఎలా అనుకున్నారు..? అమృత లాగే తమపై కూడా కూతురు అవంతి పగ పెంచుకుంటుందని ఎందుకు ఆలోచించలేదు..? కులం ముసుగులో కన్న కూతురి జీవితాన్ని చిదిమేసి..ఆ తండ్రి సంతోషంగా ఉన్నాడా..? అంటే…జైల్లో ఊచలు లెక్కిస్తూ చిప్పకూడు తింటున్నాడు.

పరువు కోసం పాకులాడితే.. ఎవరికైనా చివరకు ఇదే గతి పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.