పుల్వామా లాంటి మరో ఘటనను అడ్డుకున్న భారత బలగాలు

జమ్మూకాశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామ దాడి తరహా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 20 కిలోల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పుల్వామాలోని అవిగున్, రాజ్ పురు ప్రాంతాల్లో నకిలీ రిజిష్ట్రేషన్ నెంబర్ తో వెళ్తున్న వాహనాన్ని చెక్ పాయింట్ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. కానీ ఆ వాహనం భారీ కేడ్లను ఢీకొని ముందుకెళ్లింది. ఆ సమయంలో సెక్యూరిటీ దళాలు ఫైరింగ్ కు దిగాయి.
శాంట్రో కారును వదిలేసి డ్రైవర్ తప్పించుకుని వెళ్లాడు. ఐఈడీలతో ఉన్న వాహనాన్ని అక్కడ వదిలేసి వెళ్లినట్లుగా ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రదాడికి ప్లాన్ వేసినట్లు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఐఈడీలతో ఉన్న కారును బాంబ్ స్క్వాడ్ పేల్చేసింది.
సైన్యం, పోలీసులు, పారామిలటరీ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా ఐఈడీ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. నకిలీ రిజిష్ట్రేషన్ ఉన్న శాంట్రో కారు నెంబర్ ప్లేట్ ను అధికారులు గుర్తించారు. కతువా జిల్లాకు చెందిన స్కూటర్ నెంబర్ ప్లేట్ తో శాంట్రో వాహనాన్ని దుండగులు నడిపినట్లు అధికారులు గుర్తించారు. పరారైన ఉగ్రవాదిని ఇజ్బుల్ కార్యకర్తగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ కేసును ఎన్ ఐఏకు అప్పగించారు.
Read: మళ్లీ మధ్యవర్తిత్వం : భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరిస్తా…ట్రంప్