పని చేసిన సంస్థకే కన్నం..! రూ.6కోట్ల విలువైన బంగారు నగలు చోరీ చేసిన ఉద్యోగులు..!

పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పని చేసిన సంస్థకే కన్నం..! రూ.6కోట్ల విలువైన బంగారు నగలు చోరీ చేసిన ఉద్యోగులు..!

Updated On : October 12, 2024 / 1:41 AM IST

Sri Krishna Jewellers : తాము పని చేస్తున్న సంస్థకే వారు కన్నం వేశారు. పెద్ద మొత్తంలో గోల్డ్ నగలు దొంగిలించారు. గోల్డ్ షాపులో పని చేసే ఉద్యోగులు దాదాపు 6 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం మాయం చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లో వెలుగుచూసింది. రోడ్ నెంబర్ 10లోని శ్రీకృష్ణ జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. అంతర్గత ఆడిట్ నిర్వహించింది. సంస్థ ఉద్యోగులు ఉదయ్ కుమార్, శ్రీకాంత్ బంగారం కడ్డీలు దొంగిలించి విక్రయించినట్లుగా గుర్తించారు. వినియోగదారులకు బంగారం అందజేస్తామని నమ్మించి ఉదయ్ కుమార్ మరికొందరు ఉద్యోగుల సాయంతో విక్రయాలు సాగించినట్లుగా బయటపడింది.

మేనేజర్ గా పని చేస్తున్న సుకేతు షా నేతృత్వంలో ఉదయ్, చింటూ, సత్య, టింకూ, చందన, అజయ్ కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తెలిసింది. దీంతో హెచ్ఆర్ మేనేజర్ జయ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సుకేతు షా అదృశ్యం అయ్యారంటూ అతడి భార్య పోలీసులను ఆశ్రయించారు. తన భర్త సుకేతు షా ఈ నెల 1 నుంచి కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారామె. ఐదు రోజులుగా తాను పని చేసే ప్రాంతంలో డబ్బుల విషయంలో తనను వేధిస్తున్నారని తన భర్త తనతో చెప్పారని ఆమె పోలీసులతో చెప్పింది. సుకేతు షా భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

తన భర్త కనిపించకుండా పోవవడానికి శ్రీ కృష్ణ జువెలర్స్ యాజమాన్యం వేధింపులే కారణం అని సుకేతు షా భార్య ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఇంతకీ సుకేతు షా ఏమైపోయినట్లు? నిజంగానే ఈ చోరీ వెనుక ఆయన ప్రమేయం ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

 

Also Read : విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..