తస్మాత్ జాగ్రత్త : ఉద్యోగం పేరుతో రూ.44 లక్షలు దోచేశారు
ఉద్యోగం ఇప్పిస్తానని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి రూ.44 లక్షలు టోకరా పెట్టారు.

ఉద్యోగం ఇప్పిస్తానని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి రూ.44 లక్షలు టోకరా పెట్టారు.
ఉద్యోగం ఇప్పిస్తానని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. వారి వలలో చిక్కితే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి రూ.44 లక్షలు టోకరా పెట్టారు. నిజాంపేటకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వి.రాజన్ బాబు ఉన్నత ఉద్యోగం కోసం తన రెస్యూమ్ ను మేజర్ జాబ్ పోర్టల్ లో అప్ లోడ్ చేశారు. గతంలో ఏడు దేశాల్లో పని చేసిన అనుభవం ఉండడంతో బెటర్ జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
2019 జనవరిలో కాలిఫోర్నియా రాగల్ హోటల్ అండ్ అపార్ట్ మెంట్స్ లాస్ ఏంజిల్స్ సీఈవో విలియమ్స్ ను మాట్లాడుతున్నానంటూ మిమ్మల్ని మా కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా షార్ట్ లిస్ట్ చేశామని నమ్మించారు. ఇలా పలు విధాలుగా మే నెల వరకు ఫోన్లు చేసి రూ.44 లక్షల నగదను వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు కొద్ది రోజులు క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఒక్క రాజన్ బాబు మాత్రమే కాదు 2019 జనవరి నెల నుంచి ఇప్పటివరకు 18 జాబ్ ఫ్రాడ్స్ కేసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో నమోదయ్యాయి. మంచి ఉద్యోగం కోసం అన్వేషించే క్రమంలో తమ రెస్యూమ్ ను జాబ్ పోర్టర్ లో అప్ లోడ్ చేసిన వారికి ఫోన్ లు చేసి విదేశాల్లో మంచి ఉద్యోగంతో పాటు వేతనాలున్నాయంటూ సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు కొట్టేస్తున్నారు.
జాబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల రెస్యూమ్ లు సేకరించి వారిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని ఫోన్లు చేస్తున్నారు. వీరి ఫోన్ కాల్స్, మెయిల్స్ కు స్పందించిన వారితో మాట్లాడుతూ మీకు జాబ్ గ్యారంటీ అని నమ్మించేందుకు ఆయా కంపెనీల మెయిల్స్ ను పోలిన మెయిల్స్ నుంచి జాబ్ ఆఫర్ లెటర్లు పంపిస్తున్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన వారు, వారు అడిగినట్లుగా రిజిస్ట్రేషన్ ఫీజు, కండక్టింగ్ ఇంటర్వ్యూ, జీఎస్ టీ చార్జీలు, సర్వీసు చార్జీలు, ప్రొఫెషనల్ చార్జీల రూపంలో రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఇలా ఆరు నెలల వరకు బాధితుడితో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం ఆ తర్వాత బాధితుడు ఎదురు ప్రశ్నిస్తే సెల్ ఫెన్ లో స్పందించడం లేదు.
వివిధ జాబ్ పోర్టల్స్ లో తమ పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు ఫోన్ కాల్ రాగానే మోసగాళ్ల వలలో పడవద్దని సైబరాబాద్ క్రైబ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జాబ్ పోర్టల్స్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేస్తే స్పందించవద్దని చెప్పారు. మీకు ఫోన్ కాల్ చేసేవారిని నేరుగా ఆఫీసులోనే కలిసి నిజమా కాదా అన్నది తెలుసుకోవాలని సూచించారు.
బ్యాక్ డోర్ జాబ్ ఇప్పిస్తామంటే నకిలీదని గ్రహించాలన్నారు. ఎంఎన్ సీ కంపెనీలు నేరుగానే నియామకాలు చేపడతాయని తెలిపారు. మంచి నైపుణ్యం ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటాయని చెప్పారు. ఉద్యోగం, ఇంటర్వ్యూ కోసం ఏ కంపెనీ యాజమాన్యం డబ్బులు డిమాండ్ చేయదన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు అడుగుతున్నారంటే మోసగాళ్లని గ్రహించాలని, వారి మాటలు నమ్మవద్దన్నారు.