న్యాయం జరిగేనా : సమత అత్యాచారం, హత్య కేసు విచారణ

సమత అత్యాచారం, హత్యకేసు విచారణ వేగవంతం కానుంది. ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఇప్పటికే ఛార్జిషీట్ సమర్పించారు. మొత్తం 150 పేజీల చార్జ్ షీట్ లో 44 మంది సాక్షులను పొందుపరిచారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం నుంచి రోజుకు ఐదుగురు చొప్పున విచారించి వీలైనంత త్వరగా దోషులను తేల్చడంతోపాటు శిక్ష విధించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పనిచేయనుంది.
సమతను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హత్యచేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారించారు. DNA రిపోర్ట్ తో పోలీసులు నిందితులను గుర్తించారు. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, మఖ్దూంలపై.. 302, 376D సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేశారు. నిందితులకు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టులో అత్యాచారం, హత్య వివరాలు స్పష్టంగా తేలడంతో నిందితులు తప్పించుకోలేరని పోలీసులు భావిస్తున్నారు.
రోజూ వారి విచారణ కావడంతో కేసు త్వరలోనే తమకి న్యాయం జరుగుతుందని బాధితులు కూడా నమ్మకంగా ఉన్నారు. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు నిందితులకు న్యాయసహాయం చేయకూడదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
* నిర్మల్ జిల్లా జైనూరు మండలంలో ఉంటున్న సమత, ఆమె భర్త చిన్నపిల్లల ఆట వస్తువులు విక్రయిస్తూ జీవించేవారు.
* వ్యాపార నిమిత్తం నవంబర్ 24వ తేదీన భార్యను లింగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో భర్త వదిలిపెట్టాడు.
* కానీ తిరిగి వచ్చేసరికి సమత కనిపించలేదు.
* వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* పోలీసులు గాలించగా.. ఎల్లాపటార్ గ్రామం సమీపంలో సమత విగతజీవిగా కనిపించింది.
* విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమెను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్యచేసినట్లు తేల్చారు.
* అదేరోజు నిందితులను అరెస్ట్ చేశారు.
Read More : ఈ నేరానికి శిక్షేంంటి..? : ఉన్నావ్ తీర్పుపై ఉత్కంఠ