కేటుగాళ్లతో జాగ్రత్త.. 100 మంది అమ్మాయిలపై సైబర్ వల విసిరాడు!

  • Published By: sreehari ,Published On : July 23, 2020 / 08:40 PM IST
కేటుగాళ్లతో జాగ్రత్త.. 100 మంది అమ్మాయిలపై సైబర్ వల విసిరాడు!

Updated On : July 23, 2020 / 10:02 PM IST

అమ్మాయిలే అతడి టార్గెట్. ఆన్ లైన్‌ వేదికగా నమ్మించి వంచించాడు.. కుదిరితే మోసం చేస్తాడు.. కాదంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ఇలా ఒక్కరిని ఇద్దరిని కాదు.. ఏకంగా వంద
మంది అమ్మాయిలపై సైబర్ వల విసిరాడు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఎట్టకేలకు సైబర్ మోసగాడు పోలీసులకు చిక్కాడు.
సైబర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు కర్నూలుకు చెందిన మహ్మద్ హైమద్.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్ హైమద్ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలను సేకరించాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ ఫొటోల్ని ఆన్ లైన్లో అమ్మాయిలకు పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇనస్టాగ్రామ్ వేదికగా దాదాపు 7 నెలలుగా మహ్మద్ అమ్మాయిలను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. చివరికి హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేటుగాడి బ్లాక్ మెయిల్ వ్యవహారం బయటపడింది.

తన ఫొటోల్ని మార్ఫింగ్ చేసి తనకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ మహ్మద్‌పై పోలీసులకు ఫిర్యాదుచేసింది బాధితురాలు. దాంతో మహ్మద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణలో హైదరాబాద్ అమ్మాయితో పాటు వంద మంది అమ్మాయిలు బాధితులుగా ఉన్నారని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఏపీ, తెలంగాణలో దాదాపు 10 కేసులు ఉన్నాయని నిర్ధారించారు.