బీరు గొడవ: తుపాకీతో కాల్చి చంపేశారు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతంలో బీరు గొడవ యువకుడి ప్రాణం తీసుకుంది. సురేంద్ర, రాజు అనే ఇద్దరు యువకులు బీరు కొనేందుకు వైన్స్ షాపుకు వెళ్లి రేటు ఎక్కువగా ఉందనే కారణంతో షాపులోని వ్యక్తితో గొడవపడ్డారు. బుధవారం ఉదయం ఐచార్ ప్రాంతం పరిధిలోని వైన్స్ షాపు వద్ద ఈ గొడవ చోటు చేసుకుంది.
అక్కడ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న కుల్‌దీప్ నగర్.. కూడా వచ్చిన వ్యక్తులతో వాదనకు దిగగా.. కుల్దీప్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సురేంద్ర, రాజు తమ దగ్గర ఉన్న తుపాకీలను తీసుకుని అతడిపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అందరి ముందు సేల్స్‌మెన్ కుల్దీప్ నగర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు సిద్దమయ్యేలోపే నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పారారయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్పీ వినీత్ జైస్వాల్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీరు ధర విషయంలో జరిగిన గొడవ వల్లే నిందితులు బాధితుడిని కాల్చి చంపారా? లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.