షాహీన్ బాగ్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్ కార్యకర్తే

  • Published By: venkaiahnaidu ,Published On : February 5, 2020 / 12:31 AM IST
షాహీన్ బాగ్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఆప్ కార్యకర్తే

Updated On : February 5, 2020 / 12:31 AM IST

ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేస్తున్నవారి వద్ద గత వారం కపిల్ గుజ్జర్(25)అనే యువకుడు పోలీసులు ఉన్న ప్లేస్ కు కొంచెం దగ్గరగా నిలబడి జైశ్రీరామ్ అని బిగ్గరగా అరుస్తూ మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ ను ఆప్ కార్యకర్తగా గుర్తించారు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. 

ప్రాథమిక దర్యాప్తులో కపిల్ ఫోన్ నుంచి కొన్ని ఫొటోలు సేకరించామని, ఆ ఫొటోల ఆధారంగా కపిల్,అతడి తండ్రి ఓ సంవత్సరం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినట్లు తేలిందని క్రైం బ్రాంచ్ సీనియర్ ఆఫీసర్ రాజేష్ డియో తెలిపారు. ఆ ఫొటోలలో సంజయ్ సింగ్,అతిషి వంటి ఆప్ లీడర్లతో కపిల్ ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కు మూడు రోజుల గుడువు మాత్రమే మిగిలిఉన్న ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమైన ఇష్యూగా ఉన్న 50రోజులుగా షాహీన్ బాగ్ లో సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న సమయంలో పోలీసులు ఈ కీలక విషయాలు బయటపెట్టారు.

బీజేపీ ఇప్పటికే కేజ్రీవాలే ఆందోళనలు,నిరసనలు చేయిస్తున్నాడని ఆరోపణలు గుప్పిస్తోంది. దేశం,ఢిల్లీ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలోని మురికి కోణాన్ని చూసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాజకీయ లక్ష్యాల కోసం దేశ భద్రతను కేజ్రీవాల్,అతని మనుషులు అమ్మేశారని ఆయన అన్నారు. గతంలో కేజ్రీవాల్ ఆర్మీని విమర్శిస్తూ టెర్రరిస్టులకు సపోర్ట్ చేశాడన్నారు.

ఉగ్రకార్యకలాపాలతో లింక్ ఉన్న వ్యక్తితో కేజ్రీవాల్ సంబంధం బయటపడిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ టెర్రరిస్టులకు బిర్యానీ తినిపిస్తున్నాడని ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక కేంద్రమంత్రి ప్రకాష్ జాదవేకర్ కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది అంటూ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు రిపోర్ట్ చేసే హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నారని, ఎన్నికలకు మూడు రోజుల ముందు కుట్ర చేస్తున్నారని ఆప్ సీనియర్ లీడర్ సంజయ్ సింగ్ తెలిపారు. చేయాల్సినంత డర్టీ పాలిటిక్స్ బీజేపీ చేస్తుందన్నారు.