ఆ డ్రైవర్ దొరికాడు : 15 రోజులుగా అడవిలో దారితప్పి.. ఆహారం లేకుండా

  • Published By: madhu ,Published On : October 30, 2019 / 10:01 AM IST
ఆ డ్రైవర్ దొరికాడు : 15 రోజులుగా అడవిలో దారితప్పి.. ఆహారం లేకుండా

Updated On : October 30, 2019 / 10:01 AM IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి – చింతూరు ఘాట్‌రోడ్డులో పదిహేను రోజుల క్రితం ప్రమాదానికి గురైన టెంపో డ్రైవర్‌ బాలకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రమాదం జరిగిన తరువాత కేసులకు భయపడిన డ్రైవర్ బాలకృష్ణ… మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనికి పారిపోయాడు. 15 రోజులుగా అటవీ ప్రాంతంలోనే ఒంటరిగా తిరుగుతూ ఆహారం లేక నీరసించిపోయాడు. బాలకృష్ణను గుర్తించిన స్థానిక గిరిజనులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికుల సహాయంతో బాలకృష్ణను డోలీపై మారేడుమిల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారు. 

అక్టోబర్ 15వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రంతో పాటు, అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన భక్తులు ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. భద్రాచలం నుండి అన్నవరం తీర్థ యాత్రకు రెండు టెంపో ట్రావెలర్‌ వాహనాల్లో వెళ్తుండగా మారేడుమిల్లి- చింతూరు ఘాట్‌రోడ్డులో ఒక టెంపో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ఉండగా, ఏడుగురు మృతి చెందారు. మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. 

మడకశిరకు చెందిన టెంపో డ్రైవర్ బాలకృష్ణ ఆచూకీ లభించకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యాడని అందరూ భావించారు. భయంతో బాలకృష్ణ..సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అప్పటి నుంచి అడవిలోనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అందుబాటులోని ఊట నీరు తాగుతూ గడిపేశాడు. సమీప గ్రామానికి చెందిన గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో ఆయన్ని గమనించి, ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 

సమాచారం అందుకున్న పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆహారం లేక బాగా నీరసించిపోయి కదలలేని స్థితిలో ఉండటంతో అతడికి మారేడుమిల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. కోలుకున్న తర్వాత న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. మొత్తానికి… టెంపో డ్రైవర్‌ ఏమయ్యాడన్న అందోళనకు తెరపడింది. 
Read More : త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుంది: లోకేష్