Meghalaya Honeymoon Case: ఆ పొరపాటే హంతకులను పట్టించింది..! ఆ ఒక్క క్లూతో భార్య బండారం బట్టబయలు.. మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన విషయాలు..
మే 11న పెళ్లైతే మే 15న తన పుట్టింటికి వెళ్లింది సోనమ్. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.

Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సోనమ్ తన భర్తను చంపించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టించేలా ఈ క్రైమ్ స్టోరీ ఉందంటున్నారు. పెళ్లై 15 రోజులు తిరక్కుండానే భర్తను చంపించింది భార్య సోనమ్. ఈ హత్యకు సోనమ్ తన బాయ్ ఫ్రెండ్ ను వాడిన తీరు షాక్ కి గురి చేస్తోంది. ఇక పోలీసులను సైతం సోనమ్ ఏమార్చేందుకు ఆమె ప్రయత్నించిన తీరు చూస్తే సోనమ్ ను గుండెలు తీసిన బంటు అనిపించక మానదు. అసలు బాయ్ ఫ్రెండ్ తోనే బతకాలనుకుంటే పెళ్లెందుకు చేసుకోవాలి? ఆ తర్వాత భర్తను హత్య చేయించడం ఏమిటి? ఇప్పుడు ఈ హత్యను సమాజం ముందు ఆమె ఎలా సమర్థించుకుంటుంది?
ఎంత పెద్ద నేరం చేసినా.. నేరస్తులు చేసే చిన్న చిన్న పొరపాట్లే వారిని పట్టిస్తాయని చెబుతుంటారు. రాజా రఘువంశీ హత్య విషయంలోనూ అతని భార్య సోనమ్ ఇలానే పట్టుబడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ- సోనమ్ కు మే 11న వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం కొత్త దంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే వారు మొదట జమ్ముకశ్మీర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, అప్పటికే అక్కడ పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు.
అక్కడే రెండు రోజులు మిస్ అయినట్లు ఫిర్యాదు అందింది. దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులకు జూన్ 2న ఓ జలపాతం సమీపంలో రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. పోస్టుమార్టం రిపోర్టులో ఓ పదునైన ఆయుధంతో రాజా తలపై దాడి చేసినట్లు తేలింది. అయితే దాడికి వాడిన ఆయుధం మేఘాలయలో ఎక్కడా వినియోగించరని, దాంతో కచ్చితంగా ఈ హత్యలో బయటి ప్రాంతం వారి హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
దాంతో కాల్ డేటా పరిశీలించడంతో ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారికి ఓ ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో కాదు. గుండెలు తీసిన బంటు సోనమ్ ది. ఈ ఒక్క క్లూతో పోలీసులు తమ దర్యాఫ్తును, సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. ఘాజీపూర్ నుంచి సోనమ్ పోన్ కాల్ చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికిన చోట సోనమ్ ఫోన్ లొకేషన్, హంతకుల ఫోన్ లొకేషన్ కూడా మ్యాచ్ అయ్యింది. ఇక అసలు మాస్టర్ మైండ్ రాజ్ కుశ్వాహా మరో ఎత్తు కూడా వేసింది. రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో వారి తల్లిదండ్రులకు డౌట్ రాదని ప్లాన్ వేశాడు. అసలు ఈ మర్డర్ ప్లాన్ కు వేసిన స్కెచ్ గురించి తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.
మే 11న పెళ్లైతే మే 15న తన పుట్టింటికి వెళ్లింది సోనమ్. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఎలా హత్య చేయాలో ప్లాన్ చేసిన తర్వాత మే 20న హనీమూన్ కోసం భర్తతో కలిసి షిల్లాంగ్ వెళ్లింది సోనమ్. ఇక ఈ మధ్యలో సోనమ్, రాజ్ కుష్వాహా మధ్య వాట్సాప్ చాట్ కూడా పోలీసులు రిట్రీవ్ చేశారు. వాటన్నింటి సారాంశం కూడా ఒక్కటే. రాజా నుంచి విడిపోయి రాజ్ కుశ్వాహాతో గడపడమే. దీంతో తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజ్ కుశ్వాహా రాజా రఘువంశీని చంపేశాడు. అయితే, ఇదంతా కూడా అతడు మేఘాలయకు వెళ్లకుండానే చేయించడం గమనించాలి.
ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా కూడా అసలు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పెళ్లెందుక చేసుకోవాలి? చేసుకున్న తర్వాత భర్తను చంపించేంత క్రౌర్యం ఎలా వచ్చిందని? ఇంత చేసిన ఈ రాజ్ కుష్వాహా.. సోనమ్ కంటే ఐదేళ్లు చిన్నవాడు.