Meghalaya Honeymoon Case : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. సోనమ్ బాక్స్ ని దాచిన వ్యక్తి అరెస్ట్..

సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా వద్ద తుపాకీ ఉందని.. దాన్ని ఆభరణాలు, ల్యాప్‌టాప్‌తో పాటు ఉంచాడని సిట్ అధికారి తెలిపారు.

Meghalaya Honeymoon Case : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. సోనమ్ బాక్స్ ని దాచిన వ్యక్తి అరెస్ట్..

Meghalaya honeymoon Case

Updated On : June 22, 2025 / 9:48 PM IST

Meghalaya Honeymoon Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ మర్డర్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

రఘువంశీ భార్య సోనమ్‌కు చెందిన పెట్టెను దాచి పెట్టినందుకు సిట్ అధికారులు ​​శనివారం రాత్రి ప్రాపర్టీ డీలర్ జేమ్స్ ని అరెస్ట్ చేశారు. గత నెలలో తన భర్త హత్య జరిగిన తర్వాత భార్య సోనమ్ ఆ బాక్స్ ని ఇండోర్‌లోని ఒక ఫ్లాట్‌లో దాచిపెట్టింది. ఆ ప్లాట్ ఈ ప్రాపర్టీ డీలర్ జేమ్స్ దే.

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని భోంరాసా టోల్-గేట్ నుండి శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో భోపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మేఘాలయ పోలీసులు, సిట్ జేమ్స్ ని అరెస్ట్ చేశారు. అతను ఇండోర్‌లోని హీరా బాగ్ కాలనీలో ఒక భవనం ఆస్తి డీలర్, లీజుదారుడు. సోనమ్ బస చేసింది అక్కడే. భర్త హత్య తర్వాత ఆమె తనతో తీసుకెళ్లిన నగలు, ఇతర వస్తువులను ఓ బాక్స్ లో ఉంచుకుంది. ఆ బాక్స్ ని అక్కడ దాచింది” అని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామం నుండి బల్లా అహిర్వర్ అనే సెక్యూరిటీ గార్డ్ ను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరినీ ఇండోర్‌లోని కోర్టు ముందు హాజరుపరుస్తామని, తదుపరి దర్యాప్తు కోసం షిల్లాంగ్‌కు తీసుకెళ్లడానికి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతామని ఎస్పీ వివేక్ తెలిపారు. హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు పెట్టెలో ఉన్నాయన్నారు. ఆస్తి డీలర్.. పెట్టెలోని అన్ని వస్తువులను తగలబెట్టి పారవేసిన ప్రదేశానికి సిట్ అధికారులను తీసుకెళ్లాడు.

Also Read: ప్రాణం తీసిన పార్ట్ టైమ్ ఉద్యోగం..! ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం.. మంటల్లో సజీవ దహనం..

సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా వద్ద తుపాకీ ఉందని.. దాన్ని ఆభరణాలు, ల్యాప్‌టాప్‌తో పాటు ఉంచాడని సిట్ అధికారి తెలిపారు. మేఘాలయ నుండి తిరిగి వచ్చిన తర్వాత సోనమ్ చాలా రోజులు ఆ ఫ్లాట్‌లో ఉండి, చివరికి జూన్ 8న ఉత్తరప్రదేశ్ లో పోలీసులకు లొంగిపోయింది.

ఇండోర్ కి చెందిన ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ మ్యాన్ రాజా రఘువంశీ, సోనమ్ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న హనీమూన్ కోసం భర్త రాజాను మేఘాలయ తీసుకెళ్లింది సోనమ్. మే 23న రాజా రఘవంశీ, సోనమ్ అదృశ్యం అయ్యారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించడం మొదలు పెట్టారు. జూన్ 2న ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలో జలపాతం సమీపంలోని ఓ లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మే 23న ఆ జంట తప్పిపోయిన రోజునే.. సోహ్రాలోని ప్రసిద్ధ వీసావ్‌డాంగ్ జలపాతానికి సమీపంలోని పార్కింగ్ స్థలం సమీపంలో ముగ్గురు వ్యక్తులు రెండు కత్తులతో రాజాను నరికి చంపారు.

భర్తను భార్యే చంపించిందని పోలీసుల విచారణలో తేలింది. తన భర్తను చంపడానికి తన ప్రేమికుడితో కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయింది. మరో నలుగురు నిందితులను మధ్యప్రదేశ్, యూపీలోని వివిధ ప్రాంతాల నుండి అరెస్ట్ చేశారు.

ఈ హత్యకు సంబంధించి మేఘాలయ పోలీసులు గతంలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. సోనమ్, ఆమె ప్రేమికుడు అని చెప్పబడుతున్న రాజ్ కుష్వాహా, ఆమె ముగ్గురు స్నేహితులు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఐదుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మేఘాలయలోని జైల్లో వారిని ఉంచారు. ఈ కేసును మేఘాలయ పోలీసుల ప్రత్యేక బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది.