యాదాద్రి లో ఉద్రిక్తత : బాలికను చంపింది ఎవరు

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్‌కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్ జిల్లా కీసరలోని సెరినిటీ ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసింది. వారం రోజులుగా పదోతరగతి ముందస్తు తరగతులకు హాజరవుతోంది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంది.
గురువారం కూడా క్లాసులకు వెళ్లిన శ్రావణి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో రాత్రి వరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో ఊరంతా వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున గ్రామం సమీపంలోని ఓ పాడుబడ్డ బావిలో శ్రావణి స్కూల్ బ్యాగ్‌ను గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని డీసీపీ కె. నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు సందర్శించేందుకు రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయమే ఫిర్యాదు చేసినా రాత్రి వరకు మృతదేహాన్ని గుర్తించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దుండగులను అరెస్ట్ చేసేదాకా మృతదేహాన్ని బావిలో నుంచి తీయనివ్వబోమంటూ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. డీసీపీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో డీసీపీ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రాత్రి 11.30 వరకు గ్రామంలో ఉద్రిక్తత కొనసాగింది.
పోలీసులు చివరికి బాలిక తల్లిదండ్రులకు, గ్రామస్తులకు నచ్చజెప్పి అర్ధరాత్రి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని తరలించారు. అయితే ఘటనా స్థలానికి కొంత దూరంలో ఖాళీ మద్యం సీసాలను క్లూస్ టీం సేకరించింది. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.