నిత్యానంద శిష్యురాలి హత్య : నా బిడ్డను చంపేశారు.. సీబీఐ విచారించాలి

  • Published By: sreehari ,Published On : November 27, 2019 / 12:54 PM IST
నిత్యానంద శిష్యురాలి హత్య : నా బిడ్డను చంపేశారు.. సీబీఐ విచారించాలి

Updated On : November 27, 2019 / 12:54 PM IST

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హత్య చేశారంటూ ఓ మహిళ ఆరోపిస్తోంది. సంగీత అర్జునన్ అనే యువతి నిత్యానంద శిష్యురాలిగా ఆశ్రమంలో ఉండేది. 2014లో సంగీతను దారుణంగా హత్యచేశారంటూ ఆమె తల్లి ఝాన్సీ రాణి ఆరోపణలు చేస్తోంది. తన కుమార్తెను చంపేశారని, సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృతురాలి తల్లి ఝాన్సీ తన గోడును వెల్లబోసుకుంది. బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో సంగీత శిష్యురాలిగా ఉండేదని చెప్పుకొచ్చింది. తన కుమార్తెను దారుణంగా హత్యచేసి, గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించారంటూ రాణి ఆరోపిస్తోంది.

‘నా బిడ్డను దారుణంగా హింసించి చంపేశారు. భర్త, బిడ్డతో పాటు అన్నీ కోల్పోయాను. సంగీత గుండెనొప్పితో చనిపోలేదు. ఆశ్రమంలో హత్యకు గురైంది. సీబీఐతో విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో 2008 నుంచి 2014 వరకు తిరుచ్చి ప్రాంతానికి చెందిన సంగీత అర్జునన్ అనే యువతి ఉండేది.

అక్కడే కంప్యూటర్ విభాగంలో హెడ్‌గా పనిచేసేది. అప్పటికి సంగీతకు 24 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి తన కుమార్తెను కలిసి ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆశ్రమంలోకి అనుమతించలేదని వాపోయింది. నిత్యానంద ఆశ్రమంలో ఒక సంగీత మాత్రమే దుర్భర స్థితిలో లేదని, ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపింది. 

సంతకం చేసిన పత్రాలను చూపించి శిష్యులైన అమ్మాయిలను శిక్షించే అధికారం ఉందని సంగీతతో ఆశ్రమ అధికారులు చెప్పినట్టు ఝాన్సీ తెలిపింది. ఒకరోజున తాను ఆశ్రమం నుంచి తిరిగి ఇంటికి రావాలని అనుకుందని తల్లి రాణి చెప్పింది. తన బిడ్డతో కలిసి ఆశ్రమం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి సంగీతను తిరిగి తీసుకెళ్లినట్టు తెలిపింది.

పైగా తాను ఆశ్రమం నుంచి ఏదో దొంగలించిందంటూ పోలీసులకు అప్పగిస్తామంటూ బెదిరించారని ఝాన్సీ వాపోయింది. అప్పటినుంచి సంగీతను ఆశ్రమంలో బంధీగా ఉంచి హింసించినట్టు తెలిపింది. గంటలకొద్ది ఆశ్రమం గేటు దగ్గర నిలబడి తన కుమార్తె కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని బోరుమంది. కనీసం ఫోన్లో కూడా కుమార్తెతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 

ఆశ్రమంలోని హంసానంద, పరమానంద అనే ఇద్దరు వ్యక్తులు సంగీతతో మాట్లాడకుండా అడ్డుకున్నారని ఝాన్సీ పేర్కొంది. ఆశ్రమంలోని దేవుడి దగ్గర మీడియాకు చెప్పొద్దంటూ తనతో ప్రమాణం చేయించుకున్నారని, సంగీతను కూడా తిరిగి పంపిస్తామని చెప్పారని తెలిపింది. కానీ, చివరికి కుమార్తెను పంపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరోసారి సంగీతను బతికి ఉండగా చూడలేకపోయానని ఝాన్సీ వాపోయింది.

మరోవైపు సంగీత మరణానికి సంబంధించి నిత్యానంద సంఘా అకౌంట్ నుంచి అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ‘సంగీత గుండెనొప్పితో మరణించింది. ఆమె కుటుంబంలో వారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. అందుకే యుక్త వయస్సులోనే సంగీతకు గుండెనొప్పి వచ్చింది’ అంటూ వెబ్ సైటులో సమాచారాన్ని పొందుపరిచింది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీలు, ప్రజల అభిప్రాయాలతో పాటు సాక్ష్యా ఆధారాలు, తల్లి ఝాన్సీ రాణి నిత్యానందకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను కూడా జత చేసింది. 

కానీ, సంగీత కుటుంబం మాత్రం ఆమెకు అసలు గుండెసంబంధిత సమస్యలే లేవని తేల్చి చెప్పింది. ఆశ్రమంలో  సంగీతకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా తల్లి ఝాన్సీ అడ్డుకుంది. ఆ తర్వాత సంగీత మృతదేహానికి ఇంటికి పంపేందుకు అనుమతించారు. అంత్యక్రియలకు మాత్రమే అనుమతించి రెండోసారి పోస్టుమార్టానికి ఆశ్రమ అధికారులు నిరాకరించినట్టు మీడియాకు తెలిపింది. 

బెంగళూరులోని రామ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండోసారి పోస్టుమార్టం నిర్వహించగా.. సంగీత మృతదేహంలో అవయవాలు అదృశ్యమైనట్టు రిపోర్టులో తేలింది. ఆ తర్వాత నుంచి ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని వాపోయింది. కేసు నమోదైనప్పటి నుంచి ఐదేళ్లగా కర్ణాటక కోర్టులో విచారణ జరిగిందని తెలిపింది. ఏడాది క్రితమే ఒక జడ్జీ.. ఈ కేసుపై విచారణకు సీబీఐకి అప్పగిస్తామని చెప్పారని, 10 రోజుల్లోనే ఆ జడ్జీ బదిలీ అయ్యారని ఝాన్సీ వాపోయింది. నా కుమార్తె మరణంతో గుండెపగిలిన తన భర్త రెండేళ్ల తర్వాత ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని ఝాన్సీ కన్నీటిపర్యంతమైంది.  

స్వామి ముసుగులో ఆశ్రమంలో అమ్మాయిలను లోబర్చుకున్నట్టుగా అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానందపై మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలుతో పాటు పిల్లలను నిర్బంధించినందుకు నిత్యానందపై కేసు నమోదైంది. మరోవైపు నిత్యానంద తన ఆశ్రమం నుంచి దేశం విడిచి పారిపోయాడని పోలీసులు అంటున్నారు.