పప్పు, గ్రీన్ టీలో మత్తు మందు..నేపాల్ గ్యాంగ్ భారీ చోరీ

  • Published By: madhu ,Published On : October 7, 2020 / 11:29 AM IST
పప్పు, గ్రీన్ టీలో మత్తు మందు..నేపాల్ గ్యాంగ్ భారీ చోరీ

Updated On : October 7, 2020 / 11:47 AM IST

nepal gang robbery : హైదరాబాద్ లోని ఓ కుటుంబానికి పప్పు, గ్రీన్ టీలో మత్తు మందు కలిపి భారీ చోరీకి పాల్పడింది నేపాల్ గ్యాంగ్. రూ. 15.10 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను చోరీ చేశారు. ఐదేళ్ల బాలుడు మత్తు నుంచి తేరుకున్న తర్వాత..స్పృహలోకి వచ్చిన ఆ కుటుంబం పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది.




వివరాల్లోకి వెళితే..

చౌటుప్పల్‌కు చెందిన బోర్‌వెల్‌ వ్యాపారి గూడూరు మధుసూదన్‌ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్‌రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్‌ రెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీఎన్‌ రెడ్డి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.



రెండేళ్ల క్రితం నవీన్‌ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్‌కు చెందిన రవి అలియాస్‌ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్‌రెడ్డి ఇంట్లో హౌస్‌కీపింగ్‌ పనుల్లో చేరారు. నమ్మకంగా పని చేసేవారు. తర్వాత..రవి ద్వారా..15 రోజుల క్రితం నేపాల్ కు చెందిన మనోజ్ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. వీరు సెల్లార్ లో ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు.



భారీగా డబ్బు, ఆభరణాలు ఉన్నాయని గ్రహించారు. దీంతో చోరీకి పాల్పడాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ సోమవారం రాత్రి ప్లాన్ అమలు చేశారు. డిన్నర్ కోసం రైస్, చపాతి, పప్పు చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్‌ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్‌ పప్పుతో రైస్, చపాతి తిన్నారు. శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు.



ఆమెకు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట అనంతరం ఎక్కడి వాళ్లక్కడే సృహ తప్పిపోయారు. కానీ..శైలజ మాత్రం స్వల్పగా స్పృహ తప్పారు. ఆమెను తాళ్లతో కట్టి..బెదిరించారు. బీరువాలో ఉన్న రూ. 15.10 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన ఆభరణాలు, రెండు సెల్ ఫోన్లు చోరీ చేశారు. సెల్లార్ లో ఉన్న కుక్కకు పెరుగన్నంలో మత్తు మందు కలిపి తినిపించారు. అనంతరం అందరూ అక్కడి నుంచి పరారయ్యారు.



స్పృహలోకి వచ్చిన ఆ కుటుంబం చోరీ జరిగిందని తెలుసుకున్నారు. బంధువులకు చెప్పడంతో వారంతా అక్కడకు చేరుకున్నారు. మధుసూదన్‌ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. వీరిలో మధుసూదన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు.



సంవత్సరం క్రితం శామీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్‌ పరిధిలో నేపాల్‌ గ్యాంగ్‌ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తు చేసుకుని నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.