ఢిల్లీలో కిడ్నాప్, తెలంగాణలో విక్రయం.. పసిపిల్లలను అమ్ముతున్న ముఠా గుట్టురట్టు

ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను అపహరించి తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఢిల్లీలో కిడ్నాప్, తెలంగాణలో విక్రయం.. పసిపిల్లలను అమ్ముతున్న ముఠా గుట్టురట్టు

Child Kidnapping Gang : హైదరాబాద్ నగర శివారులో పిల్లల అమ్మకాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పసిపిల్లలను అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ముఠా నుంచి 16మంది పిల్లలను కాపాడారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను అపహరించి తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు పోలీసులు.

హైదరాబాద్ నగర శివారులో పిల్లలను అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. నెల నుంచి రెండేళ్ల వయసున్న పసి పిల్లలను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా మేడిపల్లిలో శోభారాణి, సలీమ్, స్వప్నలను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి ఇద్దరు పిల్లలను కాపాడామన్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసి.. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నామని తెలిపారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. ఢిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తీసుకొచ్చి.. ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఢిల్లీ, పుణెలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ ఆ రాష్ట్రాలకు వెళ్లిందన్నారు.

కాగా.. పిల్లలను పెంచుకుంటున్న తల్లిదండ్రులు రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను తమకివ్వాలని వేడుకున్నారు. తాము మోసపోయాం అంటూ పిల్లలను పెంచుకుంటున్న పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫొటోలు తీసుకుని ఇస్తామని చెప్పిన పోలీసులు.. వారిని తమకు ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తాము పిల్లలను కొనుగోలు చేసి వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, తమ పిల్లలను తమకు వెనక్కి ఇవ్వాలని తల్లిదండ్రులు అభ్యర్థించారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చిన్న పిల్లలను అమ్ముతున్న ముఠా గుట్టు చేశారు రాచకొండ పోలీసులు. పిల్లలు లేని వ్యక్తుల సమాచారం సేకరించి వారికి పిల్లలను విక్రయిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, పుణె, ఏపీకి చెందిన అంతరాష్ట్ర ముఠా.. ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను నియమించుకుంది. వారంతా ఏడాది నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. రాచకొండ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.

ఆ ముఠా నుంచి దాదాపు 16మంది చిన్నారులను కాపాడారు పోలీసులు. అనంతరం పిల్లలందరినీ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తరలించారు. కాగా, పిల్లలను కొని పెంచుకుంటున్న తల్లిదండ్రులు పోలీస్ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. తమ పిల్లలను కొని పెంచుకుంటున్నామని, తమ పిల్లలను తమకివ్వాలని బాధిత కుటుంబాలు పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా చేశారు. కాగా, అక్రమంగా పిల్లలను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కాబట్టి ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని రాచకొండ సీపీ తేల్చి చెప్పారు.

Also Read : ఛీ..ఛీ.. స్కానింగ్ సెంటర్‌లో ఆపరేటర్ వికృత చేష్టలు.. మహిళల ఫొటోలు, వీడియోలు తీసి..