సెంట్రల్ జైలులో కరోనా కలకలం

Professor GN Saibaba, 4 others test positive for COVID-19 in Nagpur jail : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై క్రమేపి కరోనా భయం నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న కొందరు ప్రముఖ ఖైదీలు కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. వీరిలో మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ జీఎస్ సాయిబాబా,గ్యాంగ్ స్టర అరుణ్ గావ్లీ తోపాటు మరో 7 గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది. దీంతో 2017 మార్చి నుంచి సాయిబాబా నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వికలాంగుడైన సాయిబాబాను మానవతా దృక్ఫథంతో విడిచిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున‍్నాయి.
సాయిబాబాకు శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందనీ, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం తీసుకువెళ్ల నున్నామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్ కుమార్ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ఆయనను ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ఆసుపత్రికి తరలించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో 90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది.
కాగా అనారోగ్య కారణాల వల్ల పెరోల్ పై విడుదల చేయాలని, హైదరాబాద్ లో ఉన్న తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతోందని ఆమెను చూడటానికి అనుమతివ్వాలని కోరుతూ సాయిబాబా పెట్టుకున్న పిటీషన్ ను ముంబై హై కోర్టు గతేడాది మే 22న కొట్టి వేసింది.