కాశ్మీర్ లోయలో రక్తచరిత్ర : 20 ఏళ్లుగా ఉగ్ర దాడులు

భారత్‌పై విద్వేషంతో ఉగ్రవాదులు దేశంలో నిత్యం దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టి పాక్‌లో కలిపివేయాలనే ఓ కుట్రతో ప్రతిరోజూ ఏదో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులను మన జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతూనే ఉన్నప్పటికీ.. అక్కడక్కడ అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. గత 20 ఏళ్లుగా దేశంలో జరిగిన దాడులను ఓసారి పరిశీలిద్దాం.
> 1999లో నవంబర్ 3న శ్రీనగర్‌లోని బాదామీబాగ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృత్యువాతపడ్డారు.
> 2000 ఆగస్టు 10న శ్రీనగర్ రెసిడెన్సీ రోడ్‌లో భద్రతా సిబ్బందిపై గ్రైనేడ్ దాడి. 11 మంది సైనికుల దుర్మరణం
> 2002లో మే 14 మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూలో ఆర్మీ జవాన్లు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి.. 36 మందిని పొట్టనపెట్టుకున్నారు.
> 2001 నవంబర్ 17న రాంబన్‌లో ఉగ్రదాడి. 10 మంది సైనికుల మరణం. > 2001 అక్టోబర్ 1వ తేదీన శ్రీనగర్ ఓల్డ్ శాసనసభ కాంప్లెక్సు వెలుపల కారు బాంబు పేలుడు. 38 మంది దుర్మరణం.
> 2001 మే 14వ తేదీన కలుచాక్ ఆర్మీ కంటోన్మెంట్‌పై దాడి. 36 మంది సైనికులు నెలకొరిగారు.
> 2003 జులై 22న ఉగ్రవాదులు జమ్మూలోని ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక బ్రిగేడియర్ సహా ఎనిమిది మంది జవాన్లు మృతి చెందారు.
> 2003 జూన్ 28వ తేదీన సన్జాన్ ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి. 12 మంది సైనికుల మృతి.
> 2004 మే 23న శ్రీనగర్-జమ్మూ హైవేపై ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మంది మృతి చెందగా.. వీరిలో 19 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు ఉన్నారు.
> 2004 జూన్ 24న శ్రీనగర్ పట్టణంలోని రాష్ట్రీయ రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది సైనికులు బలయ్యారు.
> 2004 ఏప్రిల్ 8వ తేదీన బారాముల్లా జిల్లాలో ఉరి వద్ద పీడీపీ ర్యాలీపై దాడి. 11 మంది మృతి.
> 2006 అక్టోబర్ 5 తేదీన శ్రీనగర్‌లోని బాద్షా చౌక్ వద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 5గురు పోలీసులు, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
> 2005 నవంబర్ 2వ తేదీన నౌగమ్‌లో సీఎం ముఫ్తీ ఇంటికి సమీపంలో ఆత్మహుతి దాడి. ముగ్గురు పోలీసులు, ఆరుగురు పౌరుల దుర్మరణం.
> 2005 జూన్ 24 శ్రీనగర్ శివారులో కారు బాంబు పేల్చివేత. 9మంది సైనికుల వీరమరణం.
> 2008 జులై 19న ఉగ్రవాదులు కశ్మీర్‌లోని నర్బల్ క్రాసింగ్ వద్ద బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు.
> 2013 మార్చి 31న సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 5గురు మృతి చెందారు.
> 2013 జూన్ 24న మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని హైదర్‌పొరాలో సైనిక వాహనాలపై దాడులు చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృత్యువాతపడ్డారు. 2013 సెప్టెంబర్ 26న మరోసారి ఆత్మాహుతి దాడులకు పాల్పడి.. 13 మందిని బలిగొన్నారు.
> 2014 నవంబర్ 7న జమ్మూ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులపై జవాన్లు కాల్పులు జరపగా.. ముగ్గురు ఉగ్రవాదులు మట్టికరిచారు.
> 2014 డిసెంబర్ 5న యూరీ సెక్టార్‌లో ఆర్మీ ఆయుధాగారంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారితో పాటు.. ఏడుగురు జవాన్లు మృతి చెందారు.
> 2016 జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మృత్యవాత పడ్డారు.
> 2016 ఫిబ్రవరి 21న శ్రీనగర్ శివార్లలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ కమాండర్లు మృతి చెందారు.
> 2016 జూన్ 25న శ్రీనగర్-జమ్మూ హైవేపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు బలయ్యారు.
> 2016 జూన్ 3వ తేదీన పాంపోర్‌లో సీఆర్పీఎఫ్ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఉగ్రవాదులంతా హతం కాగా ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు చనిపోయారు.
> 2017 ఆగస్టు 26వ తేదీన పుల్వామా జిల్లా పోలీస్ లైన్స్‌పై ఉగ్రవాదులు దాడి. 8 మంది భద్రతా సిబ్బంది మృతి.
> 2019లో జరిగిన దాడిలో ఇప్పటివరకు 44 మంది జవాన్లు మృతి చెందారు. గత 20 ఏళ్లలో ఆత్మాహుతి దాడి చేయడం ఇదే ప్రథమం అని అధికారులంటున్నారు.