సాక్ష్యాలు తారుమారు కాకుండా పోలీసులు ఏం చేశారంటే ?

హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగలిగారు. ఈ కేసు తీర్పు చూశాక ఇంకెవ్వరైనా మహిళల జోలికి వెళ్ళాలంటే భయపడాల్సిందే. కామాంధులకు ఈ తీర్పు ఓ హెచ్చరికగా నిలిచింది. హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్గోండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం, ఫిబ్రవరి6 న తీర్పు వెలువరించింది.
రాచకొండ పోలీసులు చేసిన సమగ్ర, సమర్ధవంతమైన దర్యాప్తులో ఏ కోణంలో కూడా నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు. శ్రీనివాస్‌రెడ్డి చేసిన కిరాతకాన్ని శాస్త్రీయం, సాంకేతికత, ఫోరెన్సిక్, డాక్యుమెంటేషన్‌లో ఎక్కడ కూడా ఓ చిన్న లోపం లేకుండా పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నుంచి కానిస్టేబుల్ ఆఫీసర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు సమన్వంతో కృషి చేసి హత్యలు, లైంగిక దాడి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిరూపించారు.
101 మంది సాక్ష్యులను విచారించి వారికి భద్రత పరంగా భరోసా ఇచ్చారు. శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖరారు కావడంతో దీనికి కృషి చేసిన రాచకొండ పోలీసులను బాధితుల కుటుంబాలు అభినందించాయి. వారు కన్నీరు పెట్టడంతో సీపీ వారిని ఓదార్చారు. ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు జరిగే గందరగోళం నివారించేందుకు ప్రత్యేకంగా మాక్ ట్రయల్‌ను నిర్వహించారు. దీని కోసం కోర్టు విచారణ సమయంలో ఉండే వాతావరణాన్ని సాక్ష్యులకు చూపించారు.
ఎక్కడ కూడా సాక్ష్యులు వారి చూసింది మర్చిపోకుండా ఉండేందుకు వారిలో మానసిక ఆందోళన, భయాన్ని తొలగించి వారిలో ధైర్యం నింపారు. దీంతో 101 సాక్ష్యులు ఎక్కడ కూడా కలవరానికి గురికాకుండా వారు చూసింది చెప్పడంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి ఖాయమైంది. సమర్ధవంతంగా, ప్రక్రియ ప్రకారంగా చేసిన దర్యాప్తు, విచారణలో ఫోరెన్సిక్, రెవెన్యూ, వైద్య, క్లూస్‌టీమ్, రాచకొండ ఐటీ సెల్, మృతి చెందిన విద్యార్ధుల స్కూల్ యాజమాన్యానికి, సెల్‌ఫోన్ సర్వీసు ప్రొవైడర్, డైరక్టర్ ఆఫ్ పాసిక్యూషన్, కోర్టు సిబ్బంది, అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలా ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయడం నిందితుడికి చట్టపరంగా పడాల్సిన శిక్ష ఖరారైంది.
ఈ విచారణ సందర్భంలో బాధితులకు అండగా నిలబడ్డ రాచకొండ పోలీసులు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని కూడా వచ్చేలా చేశారు.ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ 3 కేసుల్లో పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు.