’జయరామ్ ను నేనే హత్య చేశా’ : రాకేష్ రెడ్డి

హైదరాబాద్ : జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జయరామ్ ను తానే హత్య చేసినట్లు రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. హత్య చేశాక..మృతదేహంతో నందిగామ వెళ్లామని తెలిపారు. అక్కడ మృతదేహంతో ఉన్న కారును వదిలేసి బస్సులో హైదరాబాద్ కు వచ్చామని చెప్పారు.
డబ్బుల కోసమే జయరామ్ ను ఇంటికి పిలిచి నిర్బంధించానని తెలిపారు. వేధిస్తే డబ్బులు వసూలు అవుతాయనుకున్నానని చెప్పారు. డబ్బు తెప్పిస్తాడనే జయరామ్ తో అందరికీ ఫోన్ కాల్స్ చేయించానని చెప్పారు. జనవరి 31 మధ్యాహ్నం ఒంటిగంటకు జయరామ్ ను హత్య చేశానని తెలిపారు. కారులో డెడ్ బాడీ పెట్టుకొని హైదరాబాద్ లో తిరిగానని పేర్కొన్నారు. మధ్యాహ్నం 4 గంటలకు జయరామ్ డెడ్ బాడీతో నల్లకుంట పీఎస్ కు వెళ్లానని తెలిపారు. హత్య జరిగిన రోజు సీఐ శ్రీనివాస్ తో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు మాట్లాడానని చెప్పారు. బీర్ బాటిల్స్ కొనుక్కొని జయరామ్ ఒంటిపై, మూతిపై పోయాలని సీఐ శ్రీనివాస్, ఏసీపీ మల్లారెడ్డి సూచించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నామని తెలిపారు.
జయరామ్ ఇచ్చిన రూ.6 లక్షలకు మరో రూ.4 లక్షలు కలిపానని పేర్కొన్నారు. మొత్తం రూ.10 లక్షలు తీసుకొని గోవా వెళ్లామని చెప్పారు. అక్కడ కాసినో గేమ్ ఆడి రూ.20 లక్షలు సంపాదించామని తెలిపారు. మరో ఆటలో రూ.20 లక్షలు పోగొట్టుకున్నామన్నారు. ఫిబ్రవరి 3న ఉదయం గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చామని తెలిపారు. హైదరాబాద్ లో తనను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక్కడి నుండి నేరుగా బంజారాహిల్స్ ఏసీసీ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఇతనితో పాటు శ్రీనివాస్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. వీరితో పాటు ఎక్స్ ప్రెస్ టీవీలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులను, టెట్రాన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.