షోలాపూర్ లో రోడ్డు ప్రమాదం : ఏడుగురు తెలంగాణా వాసులు దుర్మరణం

షోలాపూర్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరణించిన వారంతా షోలాపూర్‌లో నివసించే తెలంగాణకు చెందిన ప్రజలుగా గుర్తించారు. తుల్జాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తుల్జాపూర్ ఘాట్ ప్రాంతంలో శింథపులే గ్రామం వద్ద సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
షోలాపూర్ గోదుతాయి పెరుళేకర్ కాలనీలో నివసించే కొందరు తుల్జాపూర్ దైవదర్శనానికి వెళ్ళేందుకు ఓ మినీ కారు అద్దెకు తీసుకుని వెళుతుండగా తుల్జాపూర్ ఘాట్‌లో శింథపలే గ్రామం వద్ద ఓ ట్యాంకర్ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఓమినీ కారు నుజ్జు నుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన ఆ కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
మరణించిన వారిని చిలువేరి రజనీ (35), చిలువేరి అపర్ణ (13), ఆడం వర్ష (12), శివకుమార్ పోబత్తి (40), నర్మదా పోబత్తి (35), నేతాజీ పోబత్తి (12), శ్రద్ద పోబత్తి (4), ఆడం లింగరాజ్ (12)లుగా గుర్తించారు.