ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి..అశుద్దం తినిపించిన గ్రామస్థులు

ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది.
స్థానిక పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…గోపర్పూర్ లో రెండు వారాల యవ్యవధిలో వివిధ కారణాలతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సెప్టెంబర్-28,2019న మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే దీని అంతటికి కారణం ఆ గ్రామంలో నివసిస్తున్న ఆరుగురు 60ఏళ్లు పైబడిన వృద్ధులేనని గ్రామస్థులు భావించారు. దీంతో మంగళవారం(అక్టోబర్-1,2019) సాయంత్రం ఆరుగురు వృద్ధులను ఇళ్లల్లో నుంచి బయటికి లాకొచ్చారు. వారి పళ్లు పీకేశారు. అందరిముందు ఆ వృద్ధుల చేత అశుద్ధం తినిపించారు. బాధితుల రోదనలను తోటి గ్రామస్థులు పట్టించుకోలేదు. ఒక్క గ్రామస్థుడు కూడా వారిని కాపాడేందుకు ముందుకు రాలేదు. వదిలిపెట్టండి..మేమేం తప్పు చేయలేదు అన్నా వారిని వదిలిపెట్టలేదు. ఆ వృద్ధులను దారుణంగా కొట్టారు. అనతంరం వారిని ఓ సామాజిక భవనంలో నిర్బంధించారు. అయితే వృద్ధులపై దాడి జరిగిందని జిల్లా హెడ్ క్వార్టర్స్ కి సమాచారం అందింది.
సమాచారం అందటంతో వెంటనే బుధవారం(అక్టోబర్-2,2019) పోలీస్ సిబ్బంది టీమ్ తో స్పాట్ కి చేరుకున్నారు ఎస్పీ బ్రిజేష్ రాయ్. బాధిత వృద్ధులను గ్రామస్థుల నుంచి కాపాడి వారిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వృద్ధుల ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం
అయితే వృద్ధులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 29మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో 22మంది మహిళలు ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు మరికొందరిని అరెస్ట్ లు చేసే అవకాశముందని ఎస్పీ తెలిపారు. వృద్ధులపై దాడి చేసిన వారిలో చాలామంది గ్రామం వదిలి పారిపోయారని,వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. గ్రామంలో పోలీసు సిబ్బందిని నియమించినట్లు కల్లికోటె పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయన్ ప్రధాన్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.