AP ESI స్కామ్ లో TDP నేత అచ్చెన్నాయుడు పేరు

  • Published By: chvmurthy ,Published On : February 21, 2020 / 10:24 AM IST
AP ESI స్కామ్ లో TDP నేత అచ్చెన్నాయుడు పేరు

Updated On : February 21, 2020 / 10:24 AM IST

ఏపీ ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ మెడికల్‌ స్కీమ్‌లో వెలుగుచూసిన కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్కామ్‌తో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు మందుల కొనుగోళ్లు జరిపించారని తెలుస్తోంది. నిజానికి మెడికల్ కొనుగోళ్లను టెండర్ పద్దతిలోనే చేపట్టాలన్న నిబంధన ఉంది. అయితే అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు సిఫారసు మేరకు అనుమతిలేని కొన్ని కంపెనీల నుంచి నామినేషన్ పద్దతిలో 51కోట్ల రూపాయల మెడిసిన్ కొనుగోళ్లు చేశారని సమాచారం. టెలీ హెల్త్ సర్వీసెస్ అనే కంపెనీ నుంచి మందుల కొనుగోళ్లకు ఆయన సిఫారసు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

తెలంగాణ తరహాలో ఏపీలోను ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ మెడికల్‌ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందని… ఇందులో ఈఎస్‌ఐకి చెందిన ముగ్గురు మెడికల్  డైరెక్టర్లు రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్‌లు అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. ఆరేళ్లలో ప్రభుత్వానికి 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారని తేల్చడంతోపాటు.. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరించింది.

మెడిసిన్స్, ల్యాబ్ కిట్స్, బయోమెట్రిక్ మెషిన్స్, ఫర్నీచర్, ఈసీజీ సర్వీసులు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ తేల్చింది. వాస్తవ ధర కంటే 132శాతం ఎక్కువ ధరకు మందులను కొనుగోళ్లు చేసినట్లు గుర్తించింది. నకిలీ కంపెనీలు, కొటేషన్లతో బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్టు నివేదికలో పేర్కొంది. జర్సన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట నకిలీ సంస్థను సృష్టించి… నిధులను మళ్లించినట్లు విజిలెన్స్ గుర్తించింది. రేట్‌ కాంట్రాక్టులో లేని సంస్థలకు కూడా మెడిసిన్ ఆర్డర్లు ఇచ్చినట్లు నకిలీ ఇండెంట్లు సృష్టించారని… ఆ పేరిట కోట్ల రూపాయలు కొట్టేశారని తేల్చింది. 

రేట్‌ కాంట్రాక్టులో ఉన్న సంస్థలకు కేవలం 38 కోట్ల రూపాయలు చెల్లించిన అధికారులు.. రేట్ కాంట్రాక్ట్‌లో లేనివారికి మాత్రం 51కోట్లు చెల్లించారని బయటపెట్టింది.  ఒక్కో బయోమెట్రిక్ ధర 16వేలు రూపాయలుండగా.. వాటిని 70వేల చొప్పున కొనుగోలు చేసినట్లు గుర్తించింది.

తెలంగాణ ESI- IMS స్కామ్‌లోని పాత్రదారులే ఇక్కడా స్కామ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. తెలంగాణలో స్కామ్‌కు తెరలేపిన.. లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఓమ్ని మెడీ, అవెంటర్‌ పర్ఫామెన్స్‌ సంస్థలే ఏపీలోను కుంభకోణానికి కారణమయ్యాయి. అప్పడు డైరెక్టర్లుగా ఉన్న రవికుమార్, రమేశ్‌కుమార్, విజయ్‌కుమార్‌ అండదండలతో అడ్డంగా దోచుకున్నాయి. ఈ మూడు సంస్థల నుంచి ల్యాబ్ కిట్లను కొనుగోలు చేసిన అధికారులు… ఏకంగా 2కోట్ల రూపాయల ల్యాబ్‌ కిట్లకు కాకిలెక్కలు చూపారు. లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి ల్యాబ్‌ కిట్లను కొనుగోలు చేసినట్లు ఇండెంట్లు సృష్టించి ఆ మొత్తాన్ని పక్కదారి పట్టించేశారు. 

ఈ తతంగమంతా  ఎలాంటి టెండర్లు లేకుండానే సాగిందన్న విషయం తెలుసుకుని విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. ఆ ముగ్గురు అధికారులతోపాటు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ల పాత్ర కూడా ఇందులో పాత్రధారులేనని తేల్చారు.
 

2018-19లో మొత్తం 18కోట్ల 49లక్షల రూపాయల విలువైన సర్జికల్ ఐటమ్స్‌ కొనుగోలు చేసినట్లు రికార్డులున్నాయి. కానీ వాటి వాస్తవ ధర 8కోట్ల 6లక్షలు మాత్రమేనని  తేల్చింది విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్. అంటే ఒక్క ఏడాదిలో కేవలం సర్జికల్‌ ఐటమ్స్‌ కొనుగోళ్లతో 10కోట్ల రూపాయలను తమ జేబుల్లో వేసుకున్నారు అక్ర మార్కులు. గత ఆరేళ్లలో మందుల కోసం ప్రభుత్వం 293 కోట్ల రూపాయలు ఈఎస్ఐకి కేటాయించగా.. అధికారులు ఏకంగా 698కోట్ల రూపాయలకు బిల్లులు సృష్టించారు. ప్రభుత్వం విడుదల చేసినదానికంటే 404 కోట్ల రూపాయల అదనపు కొనుగోళ్లు జరిపిట్లు రికార్డులు రాసేశారు.

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఈ స్కామ్‌.. ఇపుడు ఏపీకి కూడా పాకడంతో… ఇక్కడా ఏసీబీ రంగంలోకి దిగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత  ఆరు సంవత్సరాలుగా 150 కోట్ల  రూపాయలస్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2014-19 మధ్య కాలంలో 51.41 కోట్లకు సంబంధించి భారీ స్కామ్ జరిగినట్లు కనుగొన్నారు.