కామాంధుడు : అనంతపురం నారాయణ స్కూల్‌లో కీచక టీచర్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న నారాయణ స్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న కార్తీక్ వాట్సప్ ద్వారా ఎనిమిదో తరగతి విద్యార్థినికి అశ్లీల పోస్టింగ్స్, మెసేజ్‌లు పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం కీచక టీచర్‌ను నిలదీశారు. అతగాడు బుకాయించడంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు దేహశుద్ధి చేశారు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేధింపుల విషయం స్కూల్ యాజమాన్యానికి తెలిసినా గోప్యంగా ఉంచడంపై విద్యార్థిని తల్లిదండ్రులు అగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన వెలుగు చూడకుండా గోప్యంగా ఉంచాలని నారాయణ స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్తీక్‌కు విద్యార్థిని తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన విషయం బయటపడడంతో.. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ట్యూటర్ కార్తీక్‌తో పాటు నారాయణ స్కూల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వ విద్యాశాఖ ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు ఏఐఎస్‌ఎఫ్ నేతలు. నారాయణ విద్యాసంస్థలపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించారు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్. విద్యార్థినితో అసభ్యంగా వ్యవహరించాడనే సమాచారం అందడంతో వెంటనే ట్యూటర్ కార్తీక్‌ను విధుల నుంచి తొలగించామన్నారు.
Read More : మూడు గంటలకే విశాఖ లాంగ్ మార్చ్.. జనసేన క్లారిటీ