ప్రేమోన్మాది ఘాతుకం.. నర్సంపేట ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు.. అసలేం జరిగింది?

ప్రేమోన్మాది ఘాతుకంతో వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ప్రేమోన్మాది ఘాతుకం.. నర్సంపేట ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు.. అసలేం జరిగింది?

మృతులు బానోతు సుగుణ, బానోతు శ్రీనివాస్.. ఇన్ సెట్‌లో నిందితుడు నాగరాజు

chintala tanda tragedy: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఇద్దరు బలైపోయారు. దీంతో నర్సంపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుల బంధువులు, చింతలతండా వాసులు మార్చురీలోకి చొచ్చుకెళ్లారు. నిందితుడు నాగరాజు అలియాస్ బన్నీని కఠినంగా శిక్షించేవరకు పోస్ట్ మార్టం చేయొద్దని డిమాండ్ చేశారు. నిందితుడు నాగరాజు తల్లితండ్రులను సైతం శిక్షించాలని వారు డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

16 చింతల తండాలో ప్రేమోన్మాది ఘాతుకంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొని బాధిత గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నర్సంపేట మార్చురీ వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుల బంధువు ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఏమన్నారంటే..?
ప్రేమోన్మాది ఘాతుకంపై వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ స్పందించారు. నిందితుడు నాగరాజు, దీపిక పెళ్లి చేసుకొని ఇల్లు విడిచి పారిపోయారని.. అమ్మాయి తల్లిదండ్రుల పిర్యదుతో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత నాగరాజును వదిలేసి దీపిక తన ఇంటికి వచ్చేసి.. తల్లి దండ్రుల వద్దే ఉంటుందని చెప్పారు. దీపికను ఆమె తల్లిదండ్రులే పంపడం లేదనే కోపంతో నాగరాజు బుధవారం అర్ధరాత్రి కత్తితో దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. దీపిక తల్లి బానోతు సుగుణ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. తండ్రి బానోతు శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీపిక, ఆమె సోదరుడికి గాయాలయ్యాయని.. వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Also Read : ముచ్చుమర్రిలో దారుణం.. భారీగా పోలీసుల మొహరింపు.. అసలేం జరిగింది?

నర్సంపేట డివిజన్‌లో టెన్షన్
ప్రేమోన్మాది ఘాతుకంతో నర్సంపేట డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుల బంధువులు, చింతలతండా వాసులు, లంబాడా గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోనూ లంబాడా గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 16 చింతల తండాలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు.