గుండెలు పిండే విషాదం..! టీచర్ ప్రాణం తీసిన ఫోన్ కాల్..!
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Terrifying Scam (Photo Credit : Google)
Terrifying Scam : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రాణాలను తీయడానికి సైతం వెనుకాడటం లేదు. డబ్బు కోసం ఓ సైబర్ నేరస్తుడు చేసిన పనికి.. ఓ నిండు ప్రాణం పోయింది. ఓ మహిళ గుండె ఆగిపోయింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. గుండెలు పిండే ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటు చేసుకుంది. ఆగ్రాకు చెందిన ప్రభుత్వ టీచర్ మాల్తీ వర్మకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చింది. అందులో పోలీస్ ఫోటో డీపీగా ఉంది.
నీ కూతురు కాల్ గర్ల్ రాకెట్ లో పట్టుబడిందని అవతలి వ్యక్తి చెప్పాడు. ఆమెని జైలుకి పంపిస్తామని బెదిరించాడు. అయితే, లక్ష రూపాయలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని, జైలుకి వెళ్లకుండా చేస్తానని అన్నాడు. కాగా, తన కూతురి గురించి అలాంటి వార్త వినడంతో టీచర్ ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ వెంటనే గుండెపోటుతో మరణించింది.
అది ఫేక్ కాల్ అని, అతడు సైబర్ క్రిమినల్ అనే విషయం మాల్తీ వర్మకు తెలియదు. అతడు చెప్పింది విని ఆమె తీవ్ర షాక్ కి గురైంది. కూతురి గురించి అలాంటి వార్త వినడంతో ఆందోళన చెంది గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
మృతురాలు మాల్తీ వర్మ.. జూనియర్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. తప్పుడు, భయంకరమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆన్‌లైన్ చెల్లింపులు చేయమని ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలను భయపెట్టే స్కామ్ గా అభివర్ణించారు. ఓ సైబర్ మోసగాడు తన తల్లికి ఫోన్ చేశాడని, నీ కూతురు రాకెట్ లో పట్టుబడిందని బెదిరించాడని, డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకపోతే జైలుకెళుతుందని చెప్పడంతో ఆమె షాక్ కి గురై మరణించిందని మృతురాలి కుమారుడు తెలిపాడు.
ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదన్నారు. ఏదైనా అనుమానం వచ్చినా, ఎవరైనా బెదిరింపులు చేసినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.
Also Read : తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్..! రైలు ప్రయాణంలో పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..