పిల్లలా ప్రొఫెషనల్ కిల్లర్సా : 9 మంది విద్యార్థుల హత్యకు బాలికల ప్లాన్

ఆడుతు పాడుతు..స్కూల్ కు వెళుతు గడపాల్సిన చిన్నారులు హత్యలకు ప్లాన్ వేశారు. 14 ఏళ్ల బాలికలు తోటి విద్యార్థులను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తొమ్మిది మంది విద్యార్థులను హత్య చేయాలని డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్ అనే విద్యార్ధినిలు టార్గెట్ పెట్టుకున్నారు. ఎవరిని ఎప్పుడు ఎలా హత్య చేయాలనే వివరాలన్నీ చక్కగా రాసి ఫైల్ చేసి మరీ పెట్టుకున్నారు. హత్యల ప్లాన్ లను పక్కాగా అమలు చేయాలనుకునే సమయంలో అనుకోకుండా పోలీసులకు పట్టుబడిపోయారు. ఒళ్లు గగుర్పిడిచే ఈ ఘటన అమెరికాలోని ఫ్లొరిడాలో సంచలనంగా మారింది.
Also Read : శ్రీలంక పేలుళ్లలో మహిళా సూసైడ్ బాంబర్
ఫ్లోరిడాలోని పార్క్ మిడిల్ స్కూల్‌లో చదువుకునే డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్ అనే ఇద్దరు బాలికలు 9మంది తోటి విద్యార్ధులకు చంపాలనుకున్నారు. ఈ మర్డర్ ప్లాన్ కు ‘ప్రాజెక్ట్ 11/9.. ప్రైవేట్ ఇన్ఫో, డు నాట్ ఓపెన్’ అని పేరు కూడా పెట్టుకున్నారు. ప్లాన్ మొత్తం రాసి ఓ ఫైల్ తయారు చేసుకున్నారు. తాము చంపాలని టార్గెట్ చేసుకున్న విద్యార్థులతో ఫ్రెండ్ షిప్ చేసి..తరువాత వారిని ట్రాప్ చేసి హత్య చేయాలని రాసి పెట్టుకున్నారు. అంతేకాదు హత్య చేసిన తరువాత శవాలను ఎలా మాయం చేయాలో..దొరికిపోకుండా ఉండేందుకు ఎలా డ్రెస్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలో కూడా ఫైల్ లో రాసుకున్నారు.ఈ ఫైల్‌ను అమలు చేసేందుకు స్కూల్‌కు తీసుకెళ్లారు.
స్కూల్ కు తీసుకెళ్లిన ‘ప్రాజెక్ట్ 11/9’ ఫైల్‌ను స్కూల్లో పోగొట్టుకున్నారు. అది కాస్తా ఓ టీచర్‌కు దొరికింది. అది చదివిన టీచర్ షాక్ అయ్యింది. తరువాత పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే వచ్చి వారిద్దరిని విచారించారు. జస్ట్ జోక్ గా రాసి పెట్టుకున్నామని పోలీసులను నమ్మించేందుకు యత్నించారు. కానీ విచారణలో అసలు విషయం బైటపడింది. దీంతో అన్ని ఆధారాలతో ఏప్రిల్ నెల మూడో వారంలో ఫ్లొరిడా డిలెని బర్న్స్, సొలాంజ్ గ్రీన్ లను పోలీసులు అరెస్టు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసి..వారి వద్ద నుంచి 8 పేజీల ప్లాన్ ఫైలన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాలికలు ప్రొఫెషనల్ కిల్లర్ల తరహాలో ఈ ప్లాన్ తయారు చేయడం చూసి పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు. కాగా ఈ విద్యార్థినిలిద్దరు తోటి విద్యార్థులను ఎందుకు చంపాలనుకున్నారో మాత్రం పోలీసులు బయటకు వెల్లడించలేదు.