దేవుడా : పూజలు చేసిన ఇంట్లోనే దోపిడీ చేసిన పూజారులు

దేవుడా : పూజలు చేసిన ఇంట్లోనే దోపిడీ చేసిన పూజారులు

Updated On : October 31, 2019 / 7:09 AM IST

పూజలు చేసే పూజారులే.. ఆ ఇంట దొంగలుగా మారిన అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.8లక్షల నగదు దోచుకెళ్లారు. నమ్మిన చోటే మోసాలకు అవకాశం ఉంటుందనే సిద్ధాంతాన్ని రుజువు చేశారు. బెంగళూరులోని శ్రీరామ్‌పురలో ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితులు ఫిర్యాదు మేరకు ఇద్దరు పూజారులపై కేసు ఫైల్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 

చిక్కలబల్లాపుర ప్రాంతానికి చెందిన నాగరాజు(42), శ్రీరామ్ పురలో ఉంటున్న లక్ష్మణ(38)ఇద్దరు గుడిలో పూజలు చేసేవారు. సంప్రదాయం ప్రకారం.. కొన్ని పూజలు చేసేందుకు శ్రీరామ్ పురలో ఉండే పవన్ గౌడ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు. పని ఉందని చెప్పి కారు తాళాలు అడిగి తీసుకున్నారు. 

వాటితో పాటు ఇంటి తాళాలు కూడా ఉండడంతో వాటిని డూప్లికేట్ చేయించారు. అక్టోబరు 17న సిటీకి దూరంగా ధర్మస్థల అనే ప్రాంతానికి వెళ్లారు ఇంట్లోని వారు. అదే సమయాన్ని అదనుగా చూసుకుని చోరీకి పాల్పడ్డారు. ఇంటికి తిరిగి వచ్చిన వారు.. రూ.8లక్షల విలువైన బంగారం పోయినట్లు గుర్తించి పోలీసులకు కంప్లయింట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పూజారులను అనుమానించి.. అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అసలు విషయం బయటపడింది.

ఆ పూజారుల దగ్గర్నుంచి  200గ్రాముల బంగారమే దొరికింది. బ్యాంకు లాకర్లో ఉన్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా వారు తిరిగిన ప్రాంతాలను సెల్ ఫోన్ ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు పోలీసులు.